Nalgonda District: మునుగోడులో మా ముందు మూడు ఆప్షన్లు: సీపీఐ నారాయణ
![cpi narayana resonds on munugodu bypolls](https://imgd.ap7am.com/thumbnail/cr-20220819tn62ff7286052a4.jpg)
- మునుగోడులో బీజేపీని ఓడిస్తామన్న నారాయణ
- సీపీఐని టీఆర్ఎస్, కాంగ్రెస్ సంప్రదిస్తున్నాయని వెల్లడి
- నిర్ణయాన్ని శనివారం మధ్యాహ్నం ప్రకటిస్తామన్న సీపీఐ నేత
నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో జరగనున్న ఉప ఎన్నికలకు సంబంధించి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన మునుగోడు ఉప ఎన్నికల ప్రస్తావన రాగా... మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపు ఓటములను తామే నిర్ణయిస్తామని చెప్పారు. ఆ మేర బలం తమకు మునుగోడులో ఉందని కూడా నారాయణ తెలిపారు.
ఉప ఎన్నికల్లో తమ పార్టీ మద్దతును ఇటు అధికార టీఆర్ఎస్‌తో పాటు అటు కాంగ్రెస్ పార్టీ కూడా కోరుతోందని నారాయణ తెలిపారు. ఉప ఎన్నికల్లో తమ ముందు 3 ఆప్షన్లు ఉన్నాయన్న నారాయణ... పార్టీలో అందరి అభిప్రాయాల ప్రకారమే నిర్ణయం తీసుకుంటామన్నారు. శనివారం మధ్యాహ్నానికి తమ పార్టీ వైఖరిని ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించి తీరతామని నారాయణ చెప్పారు.