Medications: ఆల్కహాల్ తాగే అలవాటు ఉంటే.. ఈ ఔషధాల వినియోగంలో జాగ్రత్త
- కొన్ని ఔషధాలు పనిచేయకుండా పోతాయ్
- ఫిట్స్ వంటి సమస్యలున్న వారికి సీరియస్ కావచ్చు
- తీవ్రమైన మగత వచ్చి ప్రమాదాలకు దారితీసే రిస్క్
- వైద్య నిపుణుల హెచ్చరిక
మారిన జీవనశైలి ఫలితంగా ఆరోగ్య సమస్యలు పెరిగిపోయాయి. థైరాయిడ్, మధుమేహం, రక్తపోటు, ఒత్తిళ్లు, మానసిక కుంగుబాటు, గుండె జబ్బులు, కొలెస్ట్రాల్ ఇలా చాలానే ఉన్నాయి. వీటి కోసం రోజువారీగా ఔషధాలు తీసుకోక తప్పదు. అదే సమయంలో ఆల్కహాల్ అలవాటు ఉండి, ఈ ఔషధాలు తీసుకునే వారి పరిస్థితి ఏంటి? కొన్ని రకాల ఔషధాలు ఆల్కహాల్ తో ముడిపడవు. వ్యతిరేక క్రియ జరుగుతుంది.
అలెర్జీ నివారణకు..
బెనడ్రిల్ దగ్గు మందు గురించి తెలిసే ఉంటుంది. దీనితోపాటు, ఇతర అలెర్జీ, జలుబు నివారణకు ఇచ్చే యాంటీ హిస్టామిన్ ఔషధాలను ఆల్కహాల్ తో కలవకుండా చూసుకోవాలి. కలిపి తీసుకుంటే చాలా తీవ్రమైన మగత ఆవహిస్తుంది. దీంతో నిర్ణయాలను సరిగ్గా తీసుకోలేకపోవడం, మోటారు వాహనాన్ని నడపలేకపోవడం అనే ఇబ్బందులు ఎదురవుతాయి.
ఎపిలెప్సీ మందులు
మూర్ఛ నివారణకు వాడే మందు బిళ్లలను ఆల్కహాల్ సమయంలో తీసుకోవద్దు. మూర్ఛ రాకుండా చూసుకోవడం ఎంతో కీలకం. కనుక ఈ మందులకే ప్రాధాన్యం ఇవ్వాలి. లేదంటే మూర్ఛలు మళ్లీ మళ్లీ రావచ్చు. ఆల్కహాల్ సేవనం తర్వాత మూర్ఛ నివారణ ఔషధాలను తీసుకోవడం వల్ల అవి పనిచేయకుండా పోతాయి.
యాంటీ డిప్రెసెంట్స్
జ్ఞాపకశక్తి కోల్పోవడం, నాడీ మండల వ్యవస్థ బలహీన తీరు, శ్వాస నిదానంగా తీసుకోవడం అన్నవి యాంటీ డిప్రెసెంట్ ఔషధాలను, ఆల్కహాల్ తీసుకున్న తర్వాత వేసుకోవడం వల్ల వచ్చే దుష్ఫలితాలు.
మధుమేహం
మనదేశంలో మధుమేహుల సంఖ్య గణనీయంగానే ఉంది. గ్లూకోఫేజ్, ఒరినేస్, డయ్ బినేస్ ఇలాంటి ఔషధాలు మధుమేహం నియంత్రణ కోసం వైద్యులు సూచిస్తుంటారు. వీటిని వేసుకునే వారు ఆల్కహాల్ కు దూరంగా ఉండాలన్నది వైద్యుల సూచన. మధుమేహం ఉన్నవారు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల గుండె స్పందనలు వేగంగా పెరిగిపోయే ప్రమాదం ఉంటుంది. అసలు ఇవనే కాదు ఆల్కహాల్ అలవాటుతో సరిపడని ఔషధాలు చాలానే ఉన్నాయి.
గుండె జబ్బుల మందులు
ఛాతీలో నొప్పి వచ్చి, గుండె వైద్యులను సంప్రదించిన మీదట.. హార్ట్ ఎటాక్ రాకుండా నివారణ మందులు ఇస్తారు. కాకపోతే ఇవి తీసుకుంటే ఆల్కహాల్ ను దూరం పెట్టాలని సూచిస్తుంటారు. రక్తంలో క్లాట్ ఏర్పడకుండా వైద్యులు సూచించే మందులను కూడా ఆల్కహాల్ తో కలిపి తీసుకోకూడదు. దీనివల్ల అంతర్గత రక్తస్రావం అవుతుంది. ఔషధాలకు దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. వాటి పట్ల అవగాహన ఉండాలి. అవసరమైతే ఔషధాలను సిఫారసు చేసిన డాక్టర్ ను అడిగి ఈ వివరాలు తెలుసుకోవాలి.