har ghar thiranga: ‘జాతీయ జెండా మన గౌరవం..’.. అర్ధాంగితో కలిసి తమ ఇంటిపై జెండా ఎగురవేసిన అమిత్ షా
- ఢిల్లీలోని నివాసంపై జెండా ఎగురవేస్తున్న చిత్రాన్ని ట్వీట్ చేసిన అమిత్ షా
- ప్రధాని మోదీ పిలుపు మేరకు ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగస్వామ్యం
- మాతృభూమి కోసం త్యాగాలు చేసినవారికి నివాళులు అర్పించినట్టు వెల్లడి
భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో ప్రముఖులు పాల్గొంటున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా శనివారం తన భార్యతో కలిసి ఢిల్లీలోని తమ నివాసంపై జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ మేరకు ఫొటోను ట్వీట్ చేశారు.
‘‘మూడు రంగుల జెండా మన గౌరవం. ప్రతి భారతీయుడిని ఇది ఒక్కటి చేస్తుంది. స్ఫూర్తిని నింపుతుంది. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఢిల్లీలోని మా ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేశాం. మాతృభూమి కోసం త్యాగాలు చేసినవారికి ఘనంగా నివాళులు అర్పించాం” అని అమిత్ షా ట్విట్టర్ లో పేర్కొన్నారు.
అలాగే, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా బెంగళూరులోని తన నివాసంపై కుటుంబ సభ్యులతో కలిసి జాతీయ జెండాను ఎగురవేశారు. ఇంకా కేంద్ర మంత్రులు జైశకంర్, నితిన్ గడ్కరీ, హర్ దీప్ సింగ్ పూరి తదితరులు కూడా తమ ఇళ్లపై త్రివర్ణ పతాకాలను ఎగురవేశారు.
హర్ ఘర్ తిరంగా ఉత్సవంలో భాగంగా ఆగస్టు 13 నుంచి 15 వరకు ప్రజలంతా తమ ఇళ్లపై జాతీయ జెండాలు ఎగరేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా ప్రజలు తమ నివాసాలపై త్రివర్ణ పతాకాలను ఎగురవేస్తున్నారు.