Telangana: కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మరోమారు సారీ చెప్పిన అద్దంకి దయాకర్
![addanki dayakar says sorry to mp komatireddy venkatreddy again](https://imgd.ap7am.com/thumbnail/cr-20220813tn62f7571e25db6.jpg)
- చండూరు సభలో కోమటిరెడ్డిపై అద్దంకి దయాకర్ అనుచిత వ్యాఖ్యలు
- ఆ తర్వాత బేషరతుగా సారీ చెప్పిన అద్దంకి
- అద్దంకిని సస్పెండ్ చేయాల్సిందేనంటున్న వెంకటరెడ్డి
- పార్టీకి నష్టం జరగకూడదంటూ మరోమారు సారీ చెప్పిన అద్దంకి
నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చండూరులో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సభలో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై తాను చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఇప్పటికే ఓ దఫా క్షమాపణలు చెప్పిన అద్దంకి దయాకర్... శనివారం మరోమారు సారీ చెప్పారు. పార్టీకి నష్టం జరగకూడదన్న భావనతో మరోమారు కోమటిరెడ్డికి సారీ చెబుతున్నానని శనివారం అద్దంకి తెలిపారు. భవిష్యత్తులో మరోమారు తాను ఇలాంటి పరిణామాలకు అవకాశం ఇవ్వబోనంటూ ఆయన పేర్కొన్నారు. తన క్షమాపణలను స్వీకరించి కోమటిరెడ్డి పార్టీ కార్యక్రమాలకు హాజరు కావాలని అద్దంకి కోరారు.
చండూరు సభలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై అద్దంకి దయాకర్ అనుచిత వ్యాఖ్యలు చేసిన వెంటనే.. అక్కడే ఉన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి... అద్దంకికి నోటీసులు ఇవ్వాలంటూ పార్టీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ చిన్నారెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. క్రమశిక్షణా కమిటీ నుంచి నోటీసులు అందకముందే అద్దంకి కూడా తన తప్పు తెలుసుకుని సారీ చెప్పడంతో పాటు నోటీసులు అందాక లిఖితపూర్వకంగా సంజాయిషీ ఇచ్చారు. అయితే పార్టీ నుంచి అద్దంకిని సస్పెండ్ చేయాల్సిందేనని కోమటిరెడ్డి పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మరోమారు కోమటిరెడ్డికి అద్దంకి దయాకర్ క్షమాపణ చెప్పారు.