Telangana: ఈ నెల 21 నుంచి తెలంగాణలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్... షెడ్యూల్ ఇదిగో
![telangana eamcet engineeering counselling starts from 21st of this month](https://imgd.ap7am.com/thumbnail/cr-20220812tn62f65186eae79.jpg)
- ఈ నెల 29 వరకు ఆన్‌లైన్ స్లాట్ల బుకింగ్
- 23 నుంచి ధ్రువపత్రాల పరిశీలనతో పాటు, వెబ్ ఆప్షన్ల ఎంపిక
- సెప్టెంబర్ 6న తొలి విడత సీట్ల కేటాయింపు
- అక్టోబర్ 11 నుంచి తుది విడత సీట్ల కేటాయింపు
తెలంగాణలో ఎంసెట్ ఫలితాలు వెలువడిన శుక్రవారమే ఇంజినీరింగ్ సీట్ల భర్తీ కోసం నిర్వహించే కౌన్సెలింగ్ షెడ్యూల్ కూడా విడుదలైపోయింది. శుక్రవారం ఉదయం ఎంసెట్ ఫలితాలు విడుదల కాగా... సాయంత్రానికి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల కావడం గమనార్హం. ఈ నెల 21 నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌ను మొదలుపెట్టనున్నట్లు తెలంగాణ ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఈ ప్రకటనతో పాటే కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది.
ఈ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 21 నుంచి 29 వరకు ఆన్‌లైన్‌లో స్లాట్ బుకింగ్‌కు అవకాశం ఉంటుంది. ఈ నెల 23 నుంచి 30 వరకు విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. ఈ నెల 23 నుంచి సెప్టెంబర్ 2 వరకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కొనసాగుతుంది. అనంతరం సెప్టెంబర్ 6న ఇంజినీరింగ్ సీట్ల తొలి విడత కేటాయింపు జరగనుంది. సెప్టెంబర్ 28 నుంచి రెండో విడత, అక్టోబర్ 11 నుంచి తుది విడత సీట్ల కేటాయింపు జరగనుంది.