Komatireddy Venkat Reddy: నా రాజీనామా ఊరకే పోలేదు... ఈ నెల 21న బీజేపీలో చేరుతున్నా: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
![komatireddy rajagopal reddy talks about his resignation](https://imgd.ap7am.com/thumbnail/cr-20220812tn62f62025b015c.jpg)
- తన రాజీనామా తర్వాతే చేనేత కార్మికులకు పెన్షన్లు ప్రకటించారన్న కోమటిరెడ్డి
- మునుగోడులో రోడ్ల పనులు మొదలయ్యాయని వెల్లడి
- వెంకట్ రెడ్డి కూడా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారన్న మాజీ ఎమ్మెల్యే
కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ టికెట్ ద్వారా దక్కిన మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శుక్రవారం తన రాజీనామా తదనంతర పరిణామాలపై మాట్లాడారు. అంతేకాకుండా తన భవిష్యత్తు రాజకీయంపైనా పూర్తి స్పష్టతనిచ్చారు. తాను ఈ నెల 21న బీజేపీలో చేరనున్నట్లు ఆయన ప్రకటించారు. తన సోదరుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
ఎమ్మెల్యే పదవికి తాను చేసిన రాజీనామా ఊరకే పోలేదని రాజగోపాల్ రెడ్డి అన్నారు. తన రాజీనామా తర్వాతే తెలంగాణలో చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ ప్రకటించిందని ఆయన అన్నారు. మునుగోడులో రోడ్ల నిర్మాణం, మరమ్మతు పనులు కూడా మొదలయ్యాయని ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్‌ను వ్యక్తిగతంగా నష్టపరచాలని తనకేమీ లేదన్న రాజగోపాల్ రెడ్డి.. కేసీఆర్ తన ఆలోచనాతీరును మార్చుకోవాల్సి ఉందని అన్నారు.