Komatireddy Venkat Reddy: మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లబోను: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
![congress mp komatireddy venkat reddy says he will not go to the munugodu campaign](https://imgd.ap7am.com/thumbnail/cr-20220812tn62f612fd767bd.jpg)
- పిలవని పేరంటానికి వెళ్లే అలవాటు లేదన్న వెంకట్ రెడ్డి
- చండూరు సభకు తనకు ఆహ్వానమే అందలేదని ఆరోపణ
- సభలో సొంత పార్టీ నేతలతోనే తిట్టించారని ఆవేదన
- రేవంత్ రెడ్డి తనకు క్షమాపణ చెప్పాలన్న భువనగిరి ఎంపీ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా భావిస్తున్న నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ టికెట్ ద్వారా దక్కిన ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో మునుగోడు అసెంబ్లీకి ఉప ఎన్నిక అనివార్యంగా మారిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో శుక్రవారం పలు మీడియా ఛానెళ్లతో మాట్లాడిన వెంకట్ రెడ్డి... తాను మునుగోడు ఎన్నిక ప్రచారానికి వెళ్లేది లేదని ప్రకటించారు. పిలవని పేరంటానికి వెళ్లే అలవాటు తనకు లేదన్నారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత చండూరులో నిర్వహించిన పార్టీ సమావేశానికి తనకు ఆహ్వానం అందలేదని ఆయన ఆరోపించారు. పార్టీ సభకు ఆహ్వానం అందకపోగా... సభలో సొంత పార్టీ నేతలతోనే తనను తిట్టించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
మునుగోడు ఉప ఎన్నికకు ఇంకా షెడ్యూల్ కూడా విడుదల కాకముందే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేశారని ఆయన ఎద్దేవా చేశారు. ఓ రాజకీయ పార్టీగా, రాజకీయ నేతగా ఏ ఎన్నిక అయినా గెలుస్తామనే ధీమాతోనే ముందుకెళ్లాలన్న వెంకట్ రెడ్డి... ఎన్నికకు ముందే చేతులు ఎత్తేయడం ఏమిటంటూ విమర్శించారు. చండూరు సభలో తనను తిట్టించిన రేవంత్ రెడ్డి తనకు క్షమాపణ చెప్పాలని వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు.