Congress: రాజగోపాల్ రెడ్డిని 'ఆర్‌జీ పాల్' అని పిలవండి: రేవంత్ రెడ్డి
![revanth reddy satires on komatireddy rajagopal reddy](https://imgd.ap7am.com/thumbnail/cr-20220811tn62f4ecffdcf61.jpg)
- కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి
- త్వరలోనే మునుగోడుకు ఉప ఎన్నిక
- అనుబంధ సంఘాలే కాంగ్రెస్‌కు కీలకమన్న రేవంత్
- కేఏ పాల్‌తో రాజగోపాల్ రెడ్డిని పోల్చిన టీపీసీసీ చీఫ్
కాంగ్రెస్ పార్టీకి, మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోమారు విమర్శలు గుప్పించారు. మునుగోడు అసెంబ్లీకి త్వరలో జరగనున్న ఉప ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గానికి చెందిన పార్టీ శ్రేణులతో గురువారం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఉప ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్‌లకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. ఉప ఎన్నికల్లో పార్టీ అనుబంధ సంఘాలే కీలకంగా వ్యవహరించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు.
అనంతరం రాజగోపాల్ రెడ్డి తీరుపై సెటైర్లు సంధించిన రేవంత్ రెడ్డి... ఇకపై రాజగోపాల్ రెడ్డిని ఆర్‌జీ పాల్ అని పిలవాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఇప్పటిదాకా మనకు కేఏ పాల్ మాత్రమే ఉన్నారని, ఇకపై కేఏ పాల్‌కు మన ఆర్‌జీ పాల్ కూడా తోడయ్యారని రేవంత్ వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో రాజగోపాల్ రెడ్డి చర్యలు కామెడీని తలపిస్తున్నాయని ఆయన అన్నారు.