Andhra Pradesh: నాయీ బ్రాహ్మణులను కులం పేరుతో దూషిస్తే చట్టపరమైన చర్యలు.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
- కించపరిచే పదాలపై నిషేధం
- మంగలి, మంగలోడా అనే పదాలు ఉపయోగించకూడదు
- హర్షం వ్యక్తం చేస్తున్న నాయీ బ్రాహ్మణులు
నాయీ బ్రాహ్మణులను కించపరిచే విధంగా మాట్లాడే పదాలపై ఏపీ ప్రభుత్వం నిషేధం విధించింది. ఇకపై మంగలి, మంగలోడా, బొచ్చు గొరిగేవాడా, మంగలిది, కొండమంగలి అనే పదాలను ఉపయోగిస్తే... నాయీ బ్రాహ్మణులను అవమానపరిచినట్టుగా, వారి మనోభావాలను దెబ్బతీసినట్టుగా భావిస్తారు. ఎవరైనా ఈ పదాలు వాడితే వారిపై భారత శిక్షాస్మృతి 1860 కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి జీవో జారీ చేశారు. ఆగస్ట్ 7వ తేదీనే జీవో జారీ అయినప్పటికీ... ఇది నిన్న వెలుగులోకి వచ్చింది. మరోవైపు కుల దూషణను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై నాయీ బ్రాహ్మణులు సంతోషం వ్యక్తం చేస్తూ, ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్నారు.