Rahul Gandhi: రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరినీ జాతీయ జెండా కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారు: రాహుల్ గాంధీ

Rahul Gandhi fires on BJP

  • దేశంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు
  • హర్ ఘర్ తిరంగా పిలుపునిచ్చిన ప్రధాని మోదీ
  • ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురవేయాలని వెల్లడి
  • రేషన్ దుకాణాల్లో జెండాలు అమ్ముతున్నారన్న రాహుల్

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్రంపై మరోసారి ధ్వజమెత్తారు. రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ జాతీయ జెండా కొనుగోలు చేయాలంటూ ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. జాతీయవాదాన్ని బీజేపీ అమ్మకానికి పెట్టిందని, పేదల ఆత్మాభిమానాన్ని గాయపరుస్తోందని మండిపడ్డారు. మువ్వన్నెల పతాకం ప్రతి ఒక్కరికీ గర్వకారణమని, అది అందరి హృదయాల్లో నిలిచి ఉంటుందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. 

"జాతీయవాదం ఎప్పటికీ అమ్ముడుపోదు. రేషన్ దుకాణాల్లో సరుకులు ఇస్తూ రూ.20తో జాతీయ జెండాను కూడా కొనుగోలు చేయాలని చెప్పడం సిగ్గుచేటు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కొందరు రేషన్ కార్డుదారులు తమను జాతీయ జెండాను కొనుగోలు చేయాలని బలవంతం చేస్తున్నారని చెబుతున్న వీడియోను కూడా రాహుల్ గాంధీ పంచుకున్నారు. 

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా 'హర్ ఘర్ తిరంగా' పేరిట ప్రతి ఇంటిపైనా త్రివర్ణ పతాకం ఎగురవేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

More Telugu News