Achanta Sharath Kamal: కామన్వెల్త్ గేమ్స్: టేబుల్ టెన్నిస్ లో స్వర్ణం సాధించిన తెలుగుతేజం శరత్ కమల్
- బర్మింగ్ హామ్ లో కామన్వెల్త్ క్రీడలు
- టీటీ ఫైనల్లో విజయం సాధించిన శరత్ కమల్
- బ్యాడ్మింటన్ డబుల్స్ లోనూ స్వర్ణం మనదే!
- 21కి పెరిగిన బారత్ పసిడి పతకాల సంఖ్య
బర్మింగ్ హామ్ కామన్వెల్త్ క్రీడల్లో భారత్ పసిడి జోరు కొనసాగుతోంది. టేబుల్ టెన్నిస్ క్రీడాంశంలో పురుషుల సింగిల్స్ స్వర్ణం భారత్ ఖాతాలో చేరింది. తెలుగుతేజం ఆచంట శరత్ కమల్ టీటీలో విజేతగా నిలిచాడు. ఇవాళ జరిగిన ఫైనల్లో శరత్ కమల్ 11-13, 11-7, 11-2, 11-6, 11-7తో ఇంగ్లండ్ కు చెందిన లియామ్ పిచ్ ఫోర్డ్ ను ఓడించాడు. ఇదే ఈవెంట్లో భారత్ కు చెందిన జ్ఞానశేఖరన్ కు కాంస్యం లభించింది.
అటు, బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ లోనూ స్వర్ణం భారత్ నే వరించింది. భారత జోడీ సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి భారత్ ఖాతాలో మరో పసిడిని చేర్చారు. ఫైనల్లో సాత్విక్, చిరాగ్ జోడీ 21-15, 21-1తో ఇంగ్లండ్ కు చెందిన బెన్ లేన్, షాన్ వెండీ జోడీని చిత్తుచేసింది. తద్వారా బ్యాడ్మింటన్ క్రీడాంశంలో భారత్ కు మూడో స్వర్ణాన్ని అందించింది. ఇప్పటికే మహిళల సింగిల్స్ లో పీవీ సింధు, పురుషుల సింగిల్స్ లో లక్ష్యసేన్ పసిడి పతకాలు సాధించడం తెలిసిందే. కాగా, బర్మింగ్ హామ్ క్రీడల్లో భారత్ ఖాతాలోని స్వర్ణాల సంఖ్య 22కి పెరిగింది.