Harish Rao: నీతి ఆయోగ్​ బీజేపీకి వంత పాడటం సిగ్గు చేటు: హరీశ్​ రావు

Harishrao Fires on NITI Aayog

  • బాగా పనిచేస్తున్న తెలంగాణకు సరిగా నిధులు ఇవ్వడం లేదేమని ప్రశ్న
  • పైగా నిధులు ఇచ్చినా తెలంగాణ వాడుకోలేదంటూ అబద్ధాలు చెబుతోందని విమర్శ
  • నీతి ఆయోగ్ రాజకీయ రంగు పులుముకొందని మండిపాటు

నీతి ఆయోగ్ వాస్తవాలను తప్పుదోవ పట్టిస్తోందని తెలంగాణ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. నీతి ఆయోగ్ తీరును ఎత్తి చూపిన సీఎం కేసీఆర్ ను తప్పుపడుతూ ఆ సంస్థ విడుదల చేసిన ప్రకటనను ఖండించారు. సీఎం కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా.. ఏవేవో అంశాలతో ప్రకటన చేయడం ఏమిటని నిలదీశారు.

నీతి ఆయోగ్‌ రాజకీయ రంగు పులుముకొందని, బీజేపీకి వంతపాడేలా ప్రకటన చేయడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. నీతి ఆయోగ్‌ చెప్పినా కేంద్రం నిధులు ఇవ్వలేదని.. నిధులిచ్చినా వాడుకోలేదంటూ నీతి ఆయోగ్‌ అనడం ఏమిటని మండిపడ్డారు. నీతి ఆయోగ్ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం నిధులు ఇవ్వాల్సిందని.. అలా కాకుండా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న తప్పులను సమర్థించడం ఏమిటని నిలదీశారు. 

బాగా పనిచేసే రాష్ట్రాలకు నిధులివ్వరేం?
పెద్దగా పనితనం చూపని, వెనుకబడిన రాష్ట్రాలకు కేంద్ర ఆర్థిక సంఘం నిధులు ఇస్తున్నారని.. బాగా పనిచేస్తున్న రాష్ట్రాలకు ఎందుకు ఇవ్వడం లేదని హరీశ్ రావు నిలదీశారు. తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆరోపించారు. అభివృద్ధిలో వేగంగా ముందుకెళుతున్న తెలంగాణపై ద్వేషం ఎందుకని ప్రశ్నించారు. కేంద్ర ఆర్థిక సంఘం తెలంగాణ కోసం చేసిన సిఫార్సులను అమలు చేయాలని కేంద్రానికి ఎందుకు చెప్పడం లేదని నీతి ఆయోగ్‌ ను ప్రశ్నించారు.

Harish Rao
Telangana
Niti Aayog
BJP
TRS
India
Political
  • Loading...

More Telugu News