Margaret Alva: ఓటమితో కొన్ని విపక్షాల వైఖరిని తప్పుబట్టిన మార్గరెట్ అల్వా

Battle will continue Margaret Alva concedes defeat in veep election

  • కొన్ని పార్టీలు బీజేపీకి మద్దతుగా నిలిచాయన్న కాంగ్రెస్ నేత
  • ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బతీయాలని చూశాయన్న అల్వా
  • అలా చేయడం ద్వారా వారి విశ్వసనీయతే దెబ్బతిన్నట్టు విమర్శ

విపక్షాల అభ్యర్థిగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటమి పాలైన మార్గరెట్ అల్వా.. తన పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. రాష్ట్రపతిగా ఎన్నికైన జగ్ దీప్ ధన్ ఖడ్ కు అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు ట్విట్టర్లో అల్వా ఓ పోస్ట్ పెట్టారు. ‘‘ఈ ఎన్నికల్లో నాకు ఓటు వేసిన అన్ని ప్రతిపక్ష పార్టీల నేతలు, ఎంపీలకు ధన్యవాదాలు. అలాగే, స్వల్పకాలంలో విస్తృత ప్రచారం నిర్వహించేందుకు సేవలు అందించిన ప్రతి ఒక్క వలంటీర్ కు ధన్యవాదాలు’’అని అల్వా ట్వీట్ చేశారు. 

‘‘ఈ ఎన్నిక ప్రతిపక్షాలన్నీ కలసి పనిచేసేందుకు, గతాన్ని మరిచి, తమ మధ్య విశ్వాసాన్ని ఏర్పరుచుకునేందుకు అవకాశం కల్పించింది. కానీ, దురదృష్ట వశాత్తూ కొన్ని ప్రతిపక్షాలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బీజేపీకి మద్దతు పలికాయి. ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నం చేశాయి. అలా చేయడం ద్వారా ఆయా పార్టీలు, వాటి నేతలు సొంత విశ్వసనీయతను దెబ్బతీసుకున్నారు. ఎన్నిక ముగిసింది. కానీ, మన రాజ్యాంగం, ప్రజాస్వామ్య పటిష్ఠతకు, పార్లమెంటు గౌరవం పునరుద్ధరణ కోసం పోరాటం కొనసాగుతుంది’’అని అల్వా పేర్కొన్నారు.

More Telugu News