Telangana: సహకార సమాఖ్య స్ఫూర్తి అంటే ఇదేనా?... మోదీ సర్కారుపై నిప్పులు చెరిగిన కేసీఆర్
- రూ.24 వేల కోట్లు ఇవ్వమని నీతి ఆయోగ్ చెబితే 24 పైసలూ ఇవ్వలేదన్నా కేసీఆర్
- రూ.6 వేల కోట్లు ఇవ్వమని 15వ ఆర్థిక సంఘం చెబితే 6 పైసలు రాలేదని వ్యాఖ్య
- రాష్ట్రాల ప్రగతిని కేంద్రం దెబ్బతీస్తోందని విమర్శ
- కేంద్రంలోని పెద్దలు ఏక్‌నాథ్ షిండేలను తయారు చేస్తారట అంటూ ఎద్దేవా
కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ సర్కారుపై తెలంగాణ సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. శనివారం ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన కేసీఆర్.. గడచిన 8 ఏళ్లలో మోదీ సర్కారు తీసుకున్న పలు కీలక నిర్ణయాలను ప్రస్తావిస్తూ.. వాటి అమలు తీరుపై కీలక వ్యాఖ్యలు చేశారు. నీతి ఆయోగ్ పనితీరు కేంద్రంగానే మాట్లాడిన కేసీఆర్... మోదీ సర్కారు ఏకపక్ష నిర్ణయాలతో ముందుకు సాగుతోందని విమర్శించారు.
మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలు బాగున్నాయని చెప్పిన నీతి ఆయోగ్... తెలంగాణకు రూ.24 వేల కోట్లు ఇవ్వాలని సిఫారసు చేయగా...కేంద్రం 24 పైసలు కూడా ఇవ్వలేదని కేసీఆర్ ఆరోపించారు. దేశాభివృద్ధికి ప్రణాళికలు రచించేందుకు ఉద్దేశించిన నీతి ఆయోగ్ మాటనే కేంద్రం వినకుంటే ఎలాగని ఆయన ప్రశ్నించారు. తెలంగాణకు రూ.6 వేల కోట్ల గ్రాంట్ ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం చెప్పిందన్న కేసీఆర్.. కేంద్రం 6 పైసలు కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అన్ని రంగాల్లో దేశం సర్వనాశనం అయిపోయిందని, ఇదేమీ చిల్లర రాజకీయం కాదని, ఈ విషయాలన్నీ దేశ ప్రజలకు తెలియాల్సి ఉందని వ్యాఖ్యానించారు. దేశ భద్రత రోజురోజుకూ ప్రమాదంలో పడుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాలకు అందించాల్సిన పన్నుల వాటాను తెలివిగా కేంద్రం ఎగ్గొడుతోందని ఆరోపించారు. ఇప్పటిదాకా ఇలా రూ.13 లక్షల కోట్లు ఎగ్గొట్టిందని ఆయన చెప్పారు. సహకార సమాఖ్య స్ఫూర్తి అంటే ఇదేనా? అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాల ప్రగతిని కేంద్రం దెబ్బ తీస్తోందని కేసీఆర్ ఆరోపించారు.
చారిత్రక నగరం చెన్నై బకెట్ నీళ్ల కోసం పరితపిస్తోందని కేసీఆర్ అన్నారు. గతేడాది తెలంగాణ ఆదాయం, వ్యయం రూ.1.90 లక్షల కోట్లన్న కేసీఆర్.. కేంద్ర పథకాల నుంచి రాష్ట్రానికి వచ్చింది కేవలం రూ.5 వేల కోట్లేనని తెలిపారు. కేంద్రంలోని పెద్దలు ఏక్‌నాథ్ షిండేలను తయారు చేస్తారట అని కూడా కేసీఆర్ ధ్వజమెత్తారు. బెంగాల్, తమిళనాడుల్లో షిండేలు వస్తారని అంటారా? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా కేంద్రం చెప్పే కోఆపరేటివ్ ఫెడరలిజమ్ అని ఆయన ప్రశ్నించారు.
దేశంలో ఏకస్వామ్య పాలన ఉందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా అంటారా? అని కేసీఆర్ మండిపడ్దారు. ఇదేనా టీమిండియా స్ఫూర్తి అని ప్రశ్నించిన కేసీఆర్... దేశంలో రాజ్యాంగ బద్ధ సంస్థలను కేంద్రం తన జేబు సంస్థలుగా మార్చుకుంటోందని ఆరోపించారు. అలా మారిన ఆ సంస్థలే రేపు బీజేపీ పెద్దలను కబళిస్తాయని ఆయన హెచ్చరించారు.