Andhra Pradesh: వనరులు ఉన్నా వినియోగించుకోలేని అసమర్ధ ప్రభుత్వం: జగన్ సర్కారుపై సోము వీర్రాజు విమర్శలు

AP BJP Chief Somu Veerraju slams Jagans govt over  Ayush scheme

  • ఆయుష్ మిషన్ పథకాలను ఏపీ సరిగ్గా వినియోగించడం లేదన్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు 
  • గన్నవరంలో 100 పడకల ఆయుష్ ఆసుపత్రికి భూమి కేటాయించలేదన్న సోము
  • కుటుంబ పార్టీల పాలనా వైఫల్యం కారణంగా వైజాగ్ కు ఆయుర్వేదిక్ యూనివర్సిటీ దక్కలేదని విమర్శ 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై  బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మరోసారి విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆయుష్ మిషన్ పథక ప్రయోజనాలను సరిగ్గా వినియోగించడం లేదన్నారు. వనరులు ఉన్నా వినియోగించుకోలేని అసమర్ధ ప్రభుత్వం అంటూ జగన్ సర్కారును దుయ్యబట్టారు. 

ఆయుష్ మిషన్ కింద ఆంధ్రప్రదేశ్ కు కావలసిన కేటాయింపులు కేంద్రం చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం, అవగాహన రాహిత్యం కారణంగా ఆయుష్ విభాగం అభివృద్ధిలో ఒక అడుగు కూడా ముందుకు పడటం లేదన్నారు. ఆసుపత్రులకు కావలసిన మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా వైఫలమైందని ఆరోపించారు. 

గన్నవరంలో 100 పడకలతో ఆయుష్ ఆసుపత్రిని ఏర్పాటు చేయడానికి కేంద్రం ముందుకు వస్తే రాష్ట్ర సర్కారు భూమి కేటాయించలేకపోయిందన్నారు. ఫలితంగా ప్రజల ఆరోగ్యానికి సంబంధించి అద్భుతమైన సేవలందించే కేంద్ర ప్రభుత్వ సంస్థను ప్రజలకు అందకుండా జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. 2015లో తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో 100 పడకల ఆయుష్ హాస్పిటల్ నిర్మాణానికి కేంద్రం ప్రతిపాదనలు పంపిస్తే ఆనాటి ప్రభుత్వం నిర్లక్ష్యం రాష్ట్ర ప్రజల పాలిట శాపంగా మారి ఆసుపత్రి నిర్మాణం నిలిచిపోయిందని పేర్కొన్నారు.

 ఇక, విశాఖపట్నంలో ఆయుర్వేదిక్ యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సముఖంగా ఉన్నప్పటికీ సరైన అవగాహన లేని కుటుంబ పార్టీల పాలనా వైఫల్యం కారణంగా అది కూడా రాష్ట్రానికి దక్కకుండా పోయిందని సోము ఆవేదన వ్యక్తం చేశారు. గత మూడేళ్లలో ఆయుష్ విభాగం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సుమారుగా 29 కోట్ల రూపాయలు కేంద్ర సహాయం అందించినప్పటికీ ఆ తరహా సేవలను రాష్ట్ర ప్రజలకు అందించడంలో ఏ మేరకు సహకరించిందో ప్రభుత్వ పెద్దలు ఆత్మ పరిశీలన చేసుకోవాలని ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News