Boy: జొమాటో డెలివరీ బాయ్ గా ఏడేళ్ల బాలుడు... ఆశ్చర్యపోయిన కస్టమర్!

Boy works as Zomato delivery boy behalf of his father who met accident

  • జొమాటో డెలివరీ బాయ్ గా పనిచేస్తున్న వ్యక్తి
  • రోడ్డు ప్రమాదంలో గాయాలు
  • తండ్రి తరఫున డెలివరీలు ఇస్తున్న కుమారుడు
  • జొమాటోకు ఆలస్యంగా తెలిసిన వైనం

ప్రముఖ ఫుడ్ ఆర్డరింగ్ యాప్ జొమాటో డెలివరీ బాయ్ గా ఏడేళ్ల బాలుడు ఇంటింటికీ డెలివరీ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాహుల్ మిట్టల్ అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను పంచుకున్నారు. మిట్టల్ ఇటీవల జొమాటోలో ఓ చాక్లెట్ బాక్స్ ఆర్డర్ చేశారు. అయితే, ఆర్డర్ డెలివరీ చేసేందుకు పెద్దవాళ్లు వస్తారనుకుంటే, తలుపు దగ్గర ఏడేళ్ల పిల్లవాడిని చూసి మిట్టల్ ఆశ్చర్యపోయారు. 

ఆ అబ్బాయి చేతిలో తాను ఆర్డర్ చేసిన చాక్లెట్ బాక్స్ ఉండడంతో అతడు జొమాటో నుంచి వచ్చాడని అర్థమైంది. దాంతో, మిట్టల్ కు ఆ పిల్లవాడి పట్ల ఆసక్తి కలిగింది. 

అసలు, జొమాటోలో నువ్వెలా చేరావు? అని ప్రశ్నించాడు. అందుకు అబ్బాయి బదులిస్తూ, వాస్తవానికి తన తండ్రి జొమాటో డెలివరీ బాయ్ గా పనిచేసేవాడని వెల్లడించాడు. తన తండ్రి రోడ్డుప్రమాదంలో గాయపడి ఇంటికే పరిమితం కావడంతో, తన తండ్రి తరఫున తానే జొమాటో ఆర్డర్లు డెలివరీ ఇస్తున్నానని వివరించాడు. మరి నువ్వు స్కూలుకు వెళ్లవా? అని ప్రశ్నించగా, పగలు స్కూలుకు వెళతానని, సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు జొమాటో ఆర్డర్డు డెలివరీ ఇస్తానని తెలిపాడు. 

కాగా, ఆ బాలుడు తన తండ్రి తరఫున ఉద్యోగం చేస్తున్న విషయం జొమాటోకు కాస్త ఆలస్యంగా తెలిసింది. ఈ అంశంలో జొమాటో పెద్దమనసుతో స్పందించింది. ఆ కుటుంబ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి కఠినచర్యలు తీసుకోవడంలేదని జొమాటో వెల్లడించింది. కానీ పిల్లలతో పని చేయించడం బాలకార్మిక చట్టం ప్రకారం వ్యతిరేకం కాబట్టి ఈ విషయంలో వారికి చట్టంపై అవగాహన కల్పించింది. ఈ విషయాన్ని తమ దృష్టికి తెచ్చిన సోషల్ మీడియాకు కృతజ్ఞతలు తెలిపింది. 

కాగా, అందరూ అనుకుంటున్నట్టు ఆ బాలుడి వయసు ఏడేళ్లు కాదని, 14 ఏళ్లు అని జొమాటో చెబుతోంది.

  • Loading...

More Telugu News