Congress: ముగిసిన ఈడీ విచారణ... నేషనల్ హెరాల్డ్ కార్యాలయాన్ని వీడిన ఖర్గే
- నేషనల్ హెరాల్డ్ కేసులో ఖర్గేను విచారించిన ఈడీ
- నేషనల్ హెరాల్డ్ కార్యాలయంలోనే కొనసాగిన విచారణ
- 5 గంటల పాటు ఖర్గేను విచారించిన అధికారులు
నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే గురువారం మధ్యాహ్నం హాజరైన సంగతి తెలిసిందే. ఖర్గేను విచారణ కోసం ఈడీ అధికారులు తమ కార్యాలయానికి కాకుండా నేషనల్ హెరాల్డ్ కార్యాలయానికే పిలిచారు. ఈ కార్యాలయంలోనే ఈడీ బుధవారం సీజ్ చేసిన యంగ్ ఇండియా కార్యాలయం ఉన్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే ఈ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను విచారించిన ఈడీ... ఉన్నట్టుండి ఖర్గేను కూడా విచారణకు పిలిచింది. ఈడీ నోటీసుల నేపథ్యంలో పార్లమెంటు సమావేశాలు కొనసాగుతున్నా ఖర్గే విచారణకు హాజరయ్యారు. నేషనల్ హెరాల్డ్ కార్యాలయంలో ఖర్గేను ఈడీ అధికారులు దాదాపుగా 5 గంటలకు పైగా విచారించారు. విచారణ అనంతరం ఖర్గే నేషనల్ హెరాల్డ్ కార్యాలయాన్ని వీడారు.