Jagananna Videsi Vidya Deevena: ఏపీ విద్యార్థులకు విదేశాల్లో చదివే సువర్ణావకాశం... జగనన్న విదేశీ విద్యాదీవెనకు దరఖాస్తుల ఆహ్వానం
![Applications invites for Jagananna Videsi Vidya Deeven](https://imgd.ap7am.com/thumbnail/cr-20220804tn62eb8a520aa71.jpg)
- పలు వర్గాల వారికి అందుబాటులో విదేశీ విద్య
- ప్రభుత్వమే ఫీజు చెల్లించే అవకాశం
- కొందరికి సగం ఫీజు చెల్లింపు
- దరఖాస్తులకు సెప్టెంబరు 30 చివరి తేదీ
విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేయాలని ఉన్నా, ఆర్థికంగా స్తోమతలేని వారికి ఏపీ ప్రభుత్వం మంచి అవకాశం కల్పిస్తోంది. జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం కింద విదేశాల్లో చదువుకునేందుకు అర్హులైన విద్యార్థులకు చేయూతనిస్తోంది. ఈ మేరకు జగనన్న విదేశీ విద్యాదీవెన పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబరు 30. అర్హులైన విద్యార్థులు ప్రభుత్వ వెబ్ సైట్ (https://jnanabhumi.ap.gov.in/)లో దరఖాస్తు చేసుకోవాలి.
క్యూఎస్ వరల్డ్ ర్యాంకుల్లో టాప్-200 లో ఉన్న విదేశీ వర్సిటీలు, విద్యాసంస్థల్లో పీజీ, పీహెచ్ డీ, ఎంబీబీఎస్ కోర్సులు చదవాలనుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, కాపు, మైనారిటీ వర్గాల విద్యార్థులు జగనన్న విదేశీ విద్యాదీవెనకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు 35 ఏళ్ల లోపు ఉండాలి. ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీలో 60 మార్కులు, లేదా, అందుకు సమానమైన గ్రేడ్ కలిగి ఉండాలి. ఎంబీబీఎస్ చదవాలనుకునేవారు నీట్ రాసి అర్హత పొంది ఉండాలి.
వరల్డ్ టాప్-100 విద్యాసంస్థలు, వర్సిటీల్లో అడ్మిషన్ సాధించినవారికి ప్రభుత్వమే 100 శాతం ఫీజు చెల్లిస్తుంది. ఇక, 101 నుంచి 200 లోపు ర్యాంకు కలిగిన ప్రపంచ విద్యాసంస్థల్లో అడ్మిషన్ పొందినవారికి ఆయా విద్యాసంస్థల ఫీజులను అనుసరించి 50 శాతం ఫీజు కానీ, రూ.50 లక్షలు కానీ ప్రభుత్వమే చెల్లిస్తుంది.