Congress: నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో కీల‌క ప‌రిణామం.. యంగ్ ఇండియా కార్యాల‌యాన్ని సీజ్ చేసిన ఈడీ

ed officials seized young india office in delhi

  • నేష‌న‌ల్ హెరాల్డ్ ప్ర‌ధాన కార్యాల‌యంలోనే యంగ్ ఇండియా ఆఫీస్‌
  • రెండు రోజుల సోదాల అనంత‌రం కార్యాల‌యాన్ని సీజ్ చేసిన వైనం
  • ఏఐసీసీ కార్యాల‌యం, సోనియా, రాహుల్ నివాసాల వ‌ద్ద భారీగా మోహ‌రించిన పోలీసులు

కాంగ్రెస్ పార్టీ ప‌త్రిక నేష‌న‌ల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) అధికారులు బుధ‌వారం ఓ కీల‌క అడుగు వేశారు. ఢిల్లీలోని నేష‌న‌ల్ హెరాల్డ్ కార్యాల‌యాల‌తో పాటు కోల్‌క‌తాలోని ఆ ప‌త్రిక కార్యాల‌యాల్లో మంగ‌ళ‌వారం నుంచి సోదాలు చేసిన ఈడీ... బుధ‌వారం సోదాల‌ను ముగించిన‌ట్లు తెలిపింది. అదే స‌మ‌యంలో ఢిల్లీలోని నేష‌న‌ల్ హెరాల్డ్ ప్ర‌ధాన కార్యాల‌యంలోనే న‌డుస్తున్న యంగ్ ఇండియా కార్యాల‌యాన్ని ఈడీ అధికారులు సీజ్ చేశారు. 

ఈడీ తీసుకున్న ఈ చ‌ర్య‌తో ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యం (ఏఐసీసీ) ప‌రిస‌రాల్లో భారీగా పోలీసులు మోహ‌రించారు. ఫ‌లితంగా ఏఐసీసీ కార్యాల‌యానికి వెళ్లే దారుల‌న్నీ మూసుకుపోయాయి. అదే స‌మ‌యంలో యంగ్ ఇండియా ప్ర‌మోట‌ర్లుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీల నివాసం వ‌ద్ద కూడా పెద్ద సంఖ్య‌లో పోలీసు బ‌ల‌గాలు మోహ‌రించాయి. వెర‌సి ఢిల్లీలో హైటెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది.

Congress
Enforcement Directorate
AICC
Young India
National Herald
Sonia Gandhi
Rahul Gandhi

More Telugu News