Andhra Pradesh: ఏపీ సీఎంతో తెలంగాణ మంత్రి పువ్వాడ భేటీ!... ఫొటోలు ఇవిగో!
![ts minister puvvada ajay kumar invites ap cm ys jagan to his son marriage](https://imgd.ap7am.com/thumbnail/cr-20220803tn62ea6d6954877.jpg)
- ఈ నెల 20న పువ్వాడ అజయ్ కుమారుడి పెళ్లి
- కుమారుడి పెళ్లికి పిలిచేందుకు వెళ్లిన పువ్వాడ
- పువ్వాడ దంపతులకు సాదర స్వాగతం పలికిన జగన్ దంపతులు
ఇటీవల గోదావరి వరదల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం రాజేసిన టీఆర్ఎస్ నేత, తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బుధవారం ఏపీ రాజధాని పరిధిలోని తాడేపల్లి వెళ్లారు. సతీసమేతంగా తాడేపల్లి వెళ్లిన ఆయన ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. తన ఇంటికి వచ్చిన పువ్వాడ దంపతులకు జగన్ దంపతులు సాదర స్వాగతం పలికారు.
ఈ నెల 20న పువ్వాడ అజయ్ కుమారుడి పెళ్లి జరగనుందట. పెళ్లి ఏర్పాట్లలో భాగంగా అతిథులను పిలిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పువ్వాడ... జగన్‌ను తన కుమారుడి పెళ్లికి ఆహ్వానించేందుకు సతీసమేతంగా తాడేపల్లి వెళ్లారు. తన కుమారుడి పెళ్లికి రావాలంటూ ఆయన జగన్ దంపతులకు ఆహ్వాన పత్రిక అందజేశారు. అనంతరం జగన్ నివాసం నుంచి బయటకు వచ్చిన పువ్వాడ... జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో తన తండ్రికి మంచి సంబంధాలుండేవని గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలో జగన్ తమకు మంచి ఆప్తుడని పువ్వాడ పేర్కొన్నారు.