Apollo Hospitals: అపోలో హాస్పిటల్స్ లో రోగులకు మిల్లెట్ ఆహారం.. మంచి ఫలితాలు
- మిల్లెట్స్ లో పోషకాలు పుష్కలం
- ఈ ఆహారం తీసుకున్న రోగుల్లో మంచి రికవరీ
- అన్ని అపోలో ఆసుపత్రుల్లో ఇదే ఆహారాన్ని ఇవ్వాలని నిర్ణయం
అపోలో హాస్పిటల్స్ ప్రయత్నం ఫలించింది. చికిత్స కోసం ఆసుపత్రుల్లో చేరిన రోగులకు మిల్లెట్ ఆహారాన్ని అందిస్తోంది. ఇది మంచి ఫలితాలను ఇస్తున్నట్టు వైద్యులు గుర్తించారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ (ఐఐఎంఆర్) రోగులకు ఇవ్వతగిన పోషకాహారంపై పరిశోధనలు నిర్వహించింది. దక్షిణాది, ఉత్తరాది వంటలతో ప్రత్యేకమైన మెనూను రోగుల కోసం రూపొందించింది.
ఇడ్లీ, దోశ, వడ, రాగి ముద్ద, పొంగల్, సూప్, మాంసాహార ఐటమ్స్ కూడా మెనూలో ఉన్నాయి. బియ్యం, గోధుమలతో పోలిస్తే మిల్లెట్స్ లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో జీవనశైలి వ్యాధులు అయిన రక్తపోటు, మధుమేహం, స్థూలకాయం, గుండె, మూత్రపిండాల సమస్యలు, కాలేయ సమస్యలు, క్యాన్సర్ తదితర వ్యాధులను ఎదుర్కొనేందుకు కావాల్సిన పోషక శక్తిని మన శరీరానికి మిల్లెట్స్ అందిస్తాయి. అందుకే ఐఐఎంఆర్ రూపొందించిన మిల్లెట్స్ మెనునూ అపోలో హాస్పిటల్స్ తన రోగులకు అందిస్తోంది.
వీటి పోషక శక్తి ఫలితంగా రోగులు త్వరగా కోలుకుంటున్నట్టు అపోలో వైద్యులు తెలుసుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా తన పరిధిలోని అన్ని ఆసుపత్రుల్లో మిల్లెట్ ఆధారిత ఆహారాన్ని ఇవ్వాలని అపోలో హాస్పిటల్స్ నిర్ణయించింది. మిల్లెట్స్ సులభంగా జీర్ణమయ్యేందుకు అవసరమైన చర్యలను ఐఐఎంఆర్ తీసుకుంది.