Achinta Sheuli: కామన్వెల్త్ గేమ్స్‌ వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు పతకాల పంట.. పసిడి తెచ్చిన అచింత షూలి

Achinta Sheuli Lifts Gold in commonwealth games
  • రికార్డు స్థాయిలో 313 కేజీలు ఎత్తిన అచింత షూలి
  • ఆరుకు చేరిన పతకాల సంఖ్య
  • 52 పతకాలతో అగ్రస్థానంలో ఆస్ట్రేలియా
కామన్వెల్త్ క్రీడల్లో భారత లిఫ్టర్ల హవా కొనసాగుతోంది. ఇప్పటి వరకు భారత్ గెల్చుకున్న ఐదు పతకాలు వెయిట్‌లిఫ్టింగ్‌లోనే కాగా, తాజాగా బెంగాల్‌కు చెందిన అచింత షూలి మరో పతకం చేర్చి వాటిని ఆరుకు పెంచాడు. గత రాత్రి జరిగిన 73 కేజీల ఫైనల్‌లో అచింత మొత్తంగా 313 కేజీలు ఎత్తి స్వర్ణ పతకం సాధించాడు. లిఫ్టింగ్‌లో భారత్‌కు ఇది మూడో స్వర్ణం. స్నాచ్‌లో తొలి ప్రయత్నంలో 137 కేజీలు, రెండో ప్రయత్నంలో 140 కేజీలు ఎత్తిన అచింత.. మూడో ప్రయత్నంలో ఏకంగా 143 కేజీలు ఎత్తి రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత క్లీన్ అండ్ జెర్క్‌లోనూ అదే జోరు కొనసాగించాడు. 

తొలి ప్రయత్నంలో 166 కేజీలు ఎత్తిన అచింత రెండో ప్రయత్నంలో 170 కేజీలు ఎత్తడంలో విఫలమయ్యాడు. అయితే, మూడో ప్రయత్నంలో అంతే బరువు ఎత్తి మొత్తంగా 313 కేజీలతో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం కైవసం చేసుకున్నాడు. మలేషియాకు చెందిన హిదాయత్ 303 కేజీలతో రజతం, కెనడాకు చెందిన షాద్ 298 కేజీలతో కాంస్యం గెలుచుకున్నారు. గతేడాది జరిగిన జూనియర్ ప్రపంచ వెయిట్‌లిఫ్టింగ్‌లో రజతం గెలిచిన అచింత.. కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్‌లో 2019, 2021లో చాంపియన్‌గా నిలిచాడు. 

బర్మింగ్‌హామ్ క్రీడల్లో భారత్ ఇప్పటి వరకు ఆరు పతకాలు సాధించగా, అందులో మూడు స్వర్ణం.. రెండు రజతం, ఒక కాంస్యం లభించాయి. పాయింట్ల పట్టికలో భారత్ ఆరోస్థానంలో ఉండగా, 22 స్వర్ణాలు సహా 52 పతకాలతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది. ఇంగ్లండ్ (34), న్యూజిలాండ్ (19) రెండుమూడు స్థానాల్లో ఉన్నాయి.
Achinta Sheuli
Commonwealth Games
Weightlifting

More Telugu News