TRS: కేసీఆర్ మంచి పనే చేస్తున్నా... టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకోం: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
- ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్న తమ్మినేని
- కేసీఆర్ సంక్షేమ పథకాలు టీఆర్ఎస్‌ను గట్టెక్కించలేవని వెల్లడి
- మహారాష్ట్ర పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ భయపడుతున్నారని వ్యాఖ్య
ఓపక్క అధికార టీఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరును అభినందిస్తూనే... మరోపక్క ఆ పార్టీతో మాత్రం పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదంటూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శనివారం వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాజకీయ వేడి చూస్తుంటే... అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. 8 ఏళ్ల కాలంలో తెలంగాణలో ఏ ఒక్క డిమాండ్ కూడా నెరవేరలేదని కూడా ఆయన అన్నారు. ఈ కారణంగానే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్‌ను కేసీఆర్ సంక్షేమ పథకాలు గట్టెక్కించలేవని ఆయన జోస్యం చెప్పారు.
హైదరాబాద్ వేదికగా ఇటీవల జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల ప్రభావాన్ని తగ్గించడంలో కేసీఆర్ విజయం సాధించారని తమ్మినేని అన్నారు. బీజేపీని వ్యతిరేకిస్తూ కేసీఆర్ మంచి పనే చేస్తున్నారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయితే బీజేపీని వ్యతిరేకిస్తున్నారన్న కారణంగా టీఆర్ఎస్‌తో తమ పార్టీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు.
ప్రజాస్వామ్య యుతంగా ధర్నాలు, సభలు పెట్టుకునే స్వేచ్ఛను కూడా కేసీఆర్ ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. మహారాష్ట్రలో ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్‌కు భయం పట్టుకుందన్న తమ్మినేని... రాత్రుళ్లు కేసీఆర్‌కు నిద్ర పడుతుందో, లేదోనని కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.