Tollywood: నలుగురు నిర్మాతల కోసం షూటింగ్‌లు ఆపుతారా?.. ఊరుకునేది లేదన్న ప్రతాని రామకృష్ణ గౌడ్!
![TFCC counter to producers guild decision to stop shutings from august](https://imgd.ap7am.com/thumbnail/cr-20220730tn62e52a406b820.jpg)
- ఆగస్ట్ 1 నుంచి షూటింగ్స్ నిలిపివేస్తున్నట్లు ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రకటన
- ప్రకటనను ఖండించిన తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్
- కొందరు నిర్మాతల అత్యాశతోనే హీరోల పారితోషికాలు పెరిగాయన్న ప్రతాని
వచ్చే నెల (ఆగస్ట్) 1 నుంచి సినిమా షూటింగ్‌లు నిలిపివేస్తామన్న ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రకటనపై తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆగ్రహం వ్యక్తం చేసింది. షూటింగ్‌లను నిలిపివేస్తామన్న తమ ప్రకటనను ప్రొడ్యూసర్స్ గిల్డ్ వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.
షూటింగ్స్ నిలిపివేస్తామన్న ప్రొడ్యూసర్స్ గిల్డ్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విడుదల చేసిన ప్రకటనలో రామకృష్ణ గౌడ్ పలు కీలక ఆరోపణలు చేశారు. కేవలం నలుగురు నిర్మాతల కోసం సినిమా టికెట్ల రేట్లు పెంచడం, సినిమా షూటింగ్‌లను నిలిపివేయడం వల్ల వేల మంది సినీ కార్మికులతో పాటు చిన్న నిర్మాతలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆయన ఆరోపించారు.
టికెట్ ధరలను తగ్గించడంతో పాటుగా థియేటర్లలో పర్సంటేజీలను పక్కాగా అమలు చేయాలని రామకృష్ణ గౌడ్ డిమాండ్ చేశారు. ప్రొడ్యూసర్స్ గిల్డ్‌లోని కొందరు నిర్మాతలు అత్యాశతో హీరోల పారితోషికాలను వందల కోట్ల మేర పెంచారని ఆయన ఆరోపించారు. సినిమా షూటింగ్‌లను నిలిపివేస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు.