BJP: తెలంగాణలో దేశంలోనే అతిపెద్ద నీటిపై తేలియాడే సోలార్ ప్రాజెక్టు.. లాంఛనంగా ప్రారంభించిన ప్రధాని
- పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ జలాశయంలో ప్రాజెక్టు
- 600 ఎకరాల ప్రాజెక్టు కోసం రూ.423 కోట్ల ఖర్చు
- 4.5 లక్షల సోలార్ ప్యానెళ్లతో 40 బ్లాకులుగా ఏర్పాటైన ప్రాజెక్టు
నీటిపై తేలియాడే సోలార్ పవర్ ప్రాజెక్టుల్లో దేశంలోనే అతి పెద్దదైన ప్రాజెక్టు తెలంగాణలోనే ఆవిష్కృతమైంది. ఈ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ శనివారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా నీటిపై తేలియాడే అతిపెద్ద సోలార్ పవర్ ప్రాజెక్టు తెలంగాణలో ఆవిష్కృతం కావడం సంతోషంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు ప్రాజెక్టును ప్రధాని ప్రారంభించడానికి కాస్తంత ముందుగా ప్రాజెక్టు వివరాలను ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
ఈ ప్రాజెక్టు పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ జలాశయంలో 600 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైనట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. 100 మోగావాట్ల సామర్థ్యంలో రూ.423 కోట్లతో ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. మేక్ ఇన్ ఇండియా క్రింద దేశంలోనే తయారు చేసిన 4.5 లక్షలకు పైగా సోలార్ ప్యానెళ్లతో 40 బ్లాకులలో నిర్మించిన ఈ ప్రాజెక్టులో ఒక్కో బ్లాకులో 2.5 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి జరగనుందని ఆయన వివరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 31 వేలకు పైగా ఇళ్లకు విద్యుత్ ను సరఫరా చేయవచ్చని కిషన్ రెడ్డి తెలిపారు.
పర్యావరణ అనుకూలమైన ఈ ప్రాజెక్టు వలన సంవత్సరానికి 1.65 లక్షల టన్నుల బొగ్గు ఆదా అవుతుందన్న కిషన్ రెడ్డి.. ఈ ప్రాజెక్టుల వల్ల 2.1 లక్షల టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ విడుదలను నిరోధిస్తుందని వివరించారు. ఇటువంటి పర్యావరణ సహిత దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టు మన తెలంగాణలో ఉండటం మనందరికీ గర్వకారణని ఆయన పేర్కొన్నారు.