Rocket: భూమిపై కూలిపోతున్న చైనా రాకెట్ భాగాలు.. ఇండియాపైనా పడే అవకాశం ఉందని అంచనా

Debris from chinese rocket crashing towards earth

  • జులై 31న పడిపోయే అవకాశం ఉందని ప్రకటించిన ఏరోస్పేస్ కార్పొరేషన్
  • కూలిపోతున్న రాకెట్ భాగాల్లో 25.4 టన్నుల భారీ బూస్టర్ కూడా..
  • గత ఏడాది హిందూ మహా సముద్రంలో కూలిపడిన మరో రాకెట్ భాగాలు

చైనా ఇటీవల ప్రయోగించిన లాంగ్ మార్చ్ 5బీ రాకెట్ కు సంబంధించిన భాగాలు భూమిపై పడిపోబోతున్నాయని శాస్త్రవేత్తలు ప్రకటించారు. కొన్ని రోజుల్లోనే అది భూమి దిగువ వాతావరణంలోకి ప్రవేశిస్తుందని.. అమెరికాతోపాటు ఇండియా సహా దక్షిణాసియా ప్రాంతంలో, ఆఫ్రికా, బ్రెజిల్ తదితర ప్రాంతాల్లో ఎక్కడైనా కూలిపడే అవకాశం ఉందని తెలిపారు.

ఏరో స్పేస్ కార్పొరేషన్ హెచ్చరిక..
అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న ఏరోస్పేస్ కార్పొరేషన్ సంస్థ అంతరిక్షంలో తిరుగాడుతున్న ఉప గ్రహాలు, రాకెట్ల భాగాలు, ఇతర వస్తువులను పరిశీలిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే చాలా సార్లు భూమిపై తిరిగి పడిపోబోయే ఉప గ్రహాలు, రాకెట్ భాగాలను గుర్తించి హెచ్చరించింది కూడా. 2021 మేలో కూడా చైనా ప్రయోగించిన ఓ రాకెట్ భాగాల గురించి ఏరోస్పేస్ కార్పొరేషన్ హెచ్చరించింది. ఆ రాకెట్ భాగాలు హిందూ మహాసముద్రంలో పడిపోయాయి కూడా.

ఇటీవలే ప్రయోగించిన రాకెట్
 చైనా కొన్నిరోజుల కిందటే అంటే జులై 24వ తేదీన లాంగ్ మార్చ్ 5బీ రాకెట్ ద్వారా తమ స్పేస్ స్టేషన్ కు సంబంధించిన మాడ్యూల్ ను అంతరిక్షంలోకి పంపింది. ప్రయోగం అనంతరం రాకెట్ కు సంబంధించి ప్రధాన భాగాలు భూమి చుట్టూ తిరుగుతూ ఉండిపోయాయి. అవి మెల్లగా దిగువన భూమివైపు కదులుతున్నట్టు ఏరోస్పేస్ కార్పొరేషన్ గుర్తించింది. ఒకసారి దిగువ వాతావరణంలోకి అవి ప్రవేశించగానే.. అత్యంత వేగంతో మండిపోతూ భూమిపై పడిపోతాయి.
  • కొన్ని రోజుల్లోనే అంటే జులై 31 తేదీన రాకెట్ భాగాలు భూమి దిగువ వాతావరణంలోకి ప్రవేశిస్తాయని ఏరోస్పేస్ అంచనా వేసింది. 
  • ఆ రాకెట్ భాగాలు ప్రస్తుతం కదులుతున్న ప్రాంతం, దిగువ వాతావరణంలోకి ప్రవేశించే పరిస్థితిని బట్టి.. అవి ఏయే ప్రాంతాల్లో పడవచ్చనే అంచనా మ్యాప్ ను ఏరోస్పేస్ రూపొందించింది.
  • కూలిపోతున్న రాకెట్ భాగాల్లో 25.4 టన్నుల బరువైన భారీ బూస్టర్ కూడా ఉందని.. అది నివాసాలపై పడితే పెద్ద నష్టమే సంభవిస్తుందని ఆంగ్ల మీడియాలో వార్తలు వచ్చాయి.
  • అయితే చైనాపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని.. రాకెట్ భాగాలతో పెద్దగా నష్టం సంభవించే అవకాశాలు తక్కువని చైనాకు చెందిన గౌంచా వెబ్ సైట్ పేర్కొంది.

Rocket
Rocket Debris
India
China
Longmarch Rocket
Longmarch 5b
International
Offbeat
Space
Science
  • Loading...

More Telugu News