Cow: పాడిపశువుల్లోనూ ‘సరోగసీ’.. జగిత్యాలలో తొలిసారి ఈ విధానంలో లేగదూడ జననం
- పాడిపశువుల్లో విజయవంతంగా ‘సరోగసీ’
- ఒక పెయ్య దూడ, రెండు మగ దూడలు జననం
- పాడిపశువుల అభివృద్ధికి కీలక మలుపు అంటున్న ఎల్‌డీఏ
- పెయ్య దూడలు మాత్రమే పుట్టేలా ప్రయోగాలు చేస్తున్నట్టు చెప్పిన ఎల్‌డీఏ సీఈవో డాక్టర్ మంజువాణి
‘సరోగసీ’ అనగానే అది మనుషులకు మాత్రమే పరిమితమైన విధానమని చాలామంది అనుకుంటారు. అయితే, ఇప్పుడా ఆలోచనను తెలంగాణ పశుగణాభివృద్ధి సంస్థ మార్చేసింది. పాడిపశువుల్లోనూ ఈ విధానాన్ని విజయవంతంగా అమలు చేసి రికార్డులకెక్కింది. జగిత్యాల జిల్లాలో ఈ విధానంలో మూడు లేగదూడలు జన్మించాయి. రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థ (LDA), కోరుట్ల పశువైద్య కళాశాల సంయుక్తంగా చేపట్టిన ఈ ప్రయోగం విజయవంతం కావడంపై అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పాడిపశువుల అభివృద్ధికి ఇది కీలక మలుపు కాగలదని ఎల్‌డీఏ సీఈవో డాక్టర్ మంజువాణి పేర్కొన్నారు.
సరోగసీ విధానం ద్వారా సాహివాల్ దేశీయ జాతి గిత్త నుంచి వీర్యాన్ని సేకరించి ఫలదీకరణం చేయించి ఆ ఎంబ్రియోలను జెర్సీ ఆవు గర్భంలో ప్రవేశపెట్టినట్టు చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం కేంద్రం తెలంగాణకు రూ. 5.83 కోట్లు కేటాయించింది. జగిత్యాల జిల్లా కోరుట్ల పశువైద్య కళాశాలలో ఈ ప్రయోగాన్ని చేపట్టిన అధికారులు మొత్తం 19 ఎంబ్రియోలను ప్రయోగశాలలో అభివృద్ధి చేశారు. అనంతరం వాటిని ఆవుల గర్భంలో ప్రవేశపెట్టారు. వీటిలో ఒక పెయ్య దూడ, రెండు మగదూడలు పుట్టినట్టు మంజువాణి తెలిపారు.
సరోగసీ విధానంలో రాష్ట్రంలో దూడలు జన్మించడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. రైతుల ఆర్థికాభివృద్ధి, పాల ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా పెయ్య దూడలు మాత్రమే పుట్టేలా పరిశోధనలు చేస్తున్నట్టు చెప్పారు. మేలైన గిత్త వీర్యాన్ని ప్రయోగశాలలో విభజించే పరిజ్ఞానంపై ప్రస్తుతం పరిశోధనలు చేస్తున్నామని, వచ్చే ఏడాది నాటికి అది కూడా సాధిస్తామని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ఇదే విధానంలో ఒక ఎంబ్రియోను పాడిపశువుల గర్భంలో ప్రవేశపెట్టేందుకు ప్రైవేటు సంస్థలు రూ. 16,500 వసూలు చేస్తున్నాయని, తాము మాత్రం పూర్తి ఉచితంగానే చేస్తున్నట్టు చెప్పారు.
కాగా, పశువుల్లో కృత్రిమ గర్భ విధానం ద్వారా పశువుల్లో సంతానోత్పత్తి పెంచుతూ వస్తున్నారు. ఈ పద్ధతిలో గిత్తల నుంచి సేకరించిన వీర్యాన్ని నేరుగా పశువులకు ఇంజెక్ట్ చేస్తారు. సరోగసీ విధానంలో మాత్రం సేకరించిన వీర్యాన్ని ప్రయోగశాలల్లో ఫలదీకరణం చేయించిన అనంతరం ఎంబ్రియోలను పశువుల గర్భంలో ప్రవేశపెడతారు.