Gotabaya Rajapaksa: త్వరలోనే శ్రీలంకకు తిరిగి రావాలని భావిస్తున్న గొటబాయ రాజపక్స!
- శ్రీలంకలో ప్రజ్వరిల్లిన హింస
- దేశం విడిచి పారిపోయిన రాజపక్స
- అధ్యక్ష పదవికి రాజీనామా
- మాల్దీవుల నుంచి సింగపూర్ చేరిన నేత
శ్రీలంకలో ప్రభుత్వ వ్యతిరేక నిరసన జ్వాలలు హింసాత్మక రూపుదాల్చడంతో, తన ప్రాణాలకు ముప్పు ఉంటుందన్న భయంతో మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఇటీవల దేశం విడిచిపారిపోయారు. ఆయన తొలుత మాల్దీవులకు వెళ్లగా, అక్కడ ఆయనకు తీవ్ర నిరసనలు స్వాగతం పలికాయి. అక్కడ్నించి సింగపూర్ తరలి వెళ్లారు. సింగపూర్ లోనూ ఆయనకు సమస్యలు తప్పలేదు. దక్షిణాఫ్రికాకు చెందిన ఓ పౌరహక్కుల సంఘం ఆయనపై సింగపూర్ అటార్నీ జనరల్ కు ఫిర్యాదు చేసింది.
ఈ నేపథ్యంలో, గొటబాయ రాజపక్స త్వరలోనే శ్రీలంకకు తిరిగి రావాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. తన ప్రవాసాన్ని ముగించి మళ్లీ స్వదేశంలో అడుగుపెట్టాలని రాజపక్స కోరుకుంటున్నారు. ఈ మేరకు శ్రీలంక మంత్రివర్గ అధికార ప్రతినిధి బందుల గుణవర్ధనే వెల్లడించారు. ఆయన కచ్చితంగా ఎప్పుడు వస్తారన్నది తెలియదని, అయితే ఆయనేమీ దాక్కోలేదని, రాజకీయ ఆశ్రయంలో అంతకన్నా లేరని స్పష్టం చేశారు.
కాగా, రాజపక్స తిరిగి శ్రీలంక వచ్చి కొలంబో నగర శివార్లలోని తన ప్రైవేటు నివాసంలో ఉంటారని ఓ అధికారి వెల్లడించారు. రాజపక్స ఈ నెల 14న సింగపూర్ వెళ్లగా, ఓ ప్రైవేటు పౌరుడి హోదాలో ఆయనకు సింగపూర్ లో ప్రవేశించేందుకు అనుమతి లభించింది. సాధారణంగా సింగపూర్ వెళ్లే శ్రీలంక పౌరులకు 30 రోజుల వీసా మంజూరు చేస్తారు. అయితే, గొటబాయకు వీసా పరిమితిని కుదించినట్టు తెలుస్తోంది.