Smriti Irani: స్మృతి ఇరానీ కూతురుకి గోవాలో బార్ ఉందన్న కాంగ్రెస్.. అంతా అబద్ధమన్న కేంద్ర మంత్రి
![union minister smriti irani fire over congress on allegations on her daughter](https://imgd.ap7am.com/thumbnail/cr-20220723tn62dbe1bb11b27.jpg)
- అమేథీలో రాహుల్‌ను ఓడించినందుకే తనను టార్గెట్ చేస్తున్నారన్న స్మృతి
- 18 ఏళ్లున్న తన కూతురు కళాశాలకు వెళుతోందని వెల్లడి
- గోవాలోనే కాకుండా మరెక్కడా తమకు బార్లు లేవని స్పష్టీకరణ
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య శనివారం విమర్శలు, ప్రతి విమర్శలు చోటు చేసుకున్నాయి. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూతురుకు గోవాలో ఓ బార్ ఉందని, ఆ బార్‌ను ఇరానీ కూతురే నిర్వహిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ ఘాటు ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలు తన చెవినబడిన వెంటనే స్పందించిన స్మృతి ఇరానీ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలను ఖండించారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శల్లో లేశమాత్రం నిజం కూడా లేదని ఆమె తెలిపారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీని ఈ వివాదంలోకి లాగిన స్మృతి ఇరానీ...అమేథీలో రాహుల్ గాంధీని తాను ఓడించిన కారణంగానే తనను, తన కుటుంబ సభ్యులను కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేస్తోందని ఆమె ఆరోపించారు. అయినా 18 ఏళ్ల వయసున్న తన కూతురు ప్రస్తుతం కళాశాలకు వెళుతోందని చెప్పిన ఇరానీ... బార్‌లను నడిపేంత వయసు తన కూతురుకు ఇంకా రాలేదని తెలిపారు. గోవాలోనే కాకుండా దేశంలో మరెక్కడా కూడా తనకు గానీ, తన కూతురుకు గానీ, తన కుటుంబానికి గానీ బార్లు లేవని ఆమె స్పష్టం చేశారు.