Umpires: సమర్థులైన అంపైర్ల కోసం కొత్త కేటగిరీ ఏర్పాటు చేసిన బీసీసీఐ
- అపెక్స్ కౌన్సిల్ భేటీలో కీలక నిర్ణయాలు
- కొత్తగా అంపైర్ల కోసం ఏ ప్లస్ కేటగిరీ
- పనితీరు ఆధారంగా కేటగిరీలు
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అంపైర్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. అంపైరింగ్ విధులను అత్యంత సమర్థతతో నిర్వర్తించే అంపైర్ల కోసం కొత్త కేటగిరీ ఏర్పాటు చేసింది. గతంలో ఏ, బీ, సీ, డీ అనే కేటగిరీలు ఉండగా, కొత్తగా 'ఏ ప్లస్' అనే కేటగిరీ తీసుకువచ్చింది. ఉత్తమ పనితనం ప్రదర్శించిన అంపైర్లకు ఇందులో స్థానం కల్పించనుంది.
కొత్తగా ఏర్పాటు చేసిన ఈ 'ఏ ప్లస్' కేటగిరీలో అంతర్జాతీయ అంపైర్లు నితిన్ మీనన్, అనంత పద్మనాభన్, ఉల్హాస్ గందే, అనిల్ చౌదరి, వీరేందర్ కుమార్ శర్మ, సదాశివ్ అయ్యర్, మదన్ గోపాల్ జయరామన్, నవదీప్ సింగ్ సిద్ధూ, నిఖిల్ పట్వర్థన్ లకు స్థానం కల్పించారు. కాగా, 'ఏ' కేటగిరీలో 20, 'బీ' కేటగిరీలో 60, 'సీ' కేటగిరీలో 46, 'డీ' కేటగిరీలో 11 మంది అంపైర్లు ఉన్నారు.
అపెక్స్ కౌన్సిల్ ఆమోదించిన మేరకు దేశవాళీ క్రికెట్లో బాధ్యతలు నిర్వహించే ఏ ప్లస్, ఏ కేటగిరీ అంపైర్లకు రోజుకు రూ.40 వేలు, బీ, సీ కేటగిరీ అంపైర్లకు రోజుకు రూ.30 వేలు చెల్లించనున్నారు. ఈ మేరకు మాజీ అంతర్జాతీయ అంపైర్లతో కూడిన సబ్ కమిటీ సిఫారసులను బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ ఆమోదించింది.