Vijayashanti: ఎన్నికల ముందే లోన్లు మంజూరు చేశామన్న కేసీఆర్ మాటలు నీటిమూటల్లా తేలిపోయాయి: విజయశాంతి

Vijayasanthi potshots against KCR

  • కేసీఆర్ సర్కారుపై విజయశాంతి విమర్శలు
  • బీసీ యువతకు లోన్లు ఇస్తామన్నారని వెల్లడి
  • భారీగా దరఖాస్తులు వచ్చాయని వ్యాఖ్యలు
  • ఇప్పటికీ రుణాల కోసం తిరుగుతున్నారన్న విజయశాంతి

కేసీఆర్ ప్రభుత్వ పాలన 'పేరు గొప్ప ఊరు దిబ్బ' తరహాలో ఉందని బీజేపీ మహిళా నేత విజయశాంతి విమర్శించారు. స్వయం ఉపాధి పొందాలనుకున్న బీసీ యువతకు లోన్లు ఇస్తామంటూ ప్రభుత్వం 2018లో ప్రకటించిందని వెల్లడించారు. 80 శాతం, 70.50 శాతం సబ్సిడీతో రూ.1 లక్ష నుంచి రూ.10 లక్షల వరకు లోన్లు ఇస్తామని చెప్పిందని వివరించారు. ప్రభుత్వ ప్రకటనలో నిరుద్యోగులు భారీ సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారని, అయితే ప్రభుత్వం హామీ ఇచ్చి నాలుగేళ్లు గడిచినా ఈ దరఖాస్తులకు మోక్షం కలగడంలేదని విజయశాంతి ఆరోపించారు. 

వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని, కానీ కేసీఆర్ ప్రభుత్వం కొద్దిమందికే, అది కూడా సగం డబ్బులు ఇచ్చి చేతులు దులుపుకుందని విమర్శించారు. అటు ఉద్యోగాలు దొరక్క, ఇటు స్వయం ఉపాధి లేక వేలాది మంది ఇబ్బందులు పడుతున్నారని, కొందరైతే తమకు లోన్లు మంజూరు చేయాలంటూ బీసీ సంక్షేమ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారని విజయశాంతి పేర్కొన్నారు.   

దీంతో, 2018 ఎన్నికల ముందే లోన్లు మంజూరు చేశామని కేసీఆర్ చెప్పిన మాటలు నీటి మూటల్లా మిగిలిపోయాయని విమర్శించారు. ఎన్నికలు వస్తేనే ప్రజలు గుర్తుకు వచ్చే కేసీఆర్ కు తెలంగాణ ప్రజానీకమే తగిన గుణపాఠం చెబుతుందని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News