kERALA: ఈ చిన్న గిరిజన గ్రామం.. ఆనంద్ మహీంద్రాకు తెగనచ్చేసిందట!
- కేరళలోని ఎన్నోర్ లో ఏర్పాటు
- గత నెలలోనే పూర్తయిన వినూత్న ప్రాజెక్టు
- అద్భుతంగా ఉందన్న ఆనంద్ మహీంద్రా
కేరళలోని వేనాడ్ తేయాకు తోటలకు ప్రసిద్ది. ఇక్కడి కొండ ప్రాంతాల అందాలను చూడ్డానికి రెండు కళ్లు సరిపోవు. ఇక్కడే చుట్టూ కొండల మధ్య కేరళ పర్యాటక విభాగం కొన్ని గిరిజన గూడెంలను నిర్మించింది. వీటితో పర్యాటకులను ఆకర్షించాలన్నది వారి ప్రయత్నం. ఈ గ్రామానికి ఎన్నోర్ అనే పేరు పెట్టారు. కొండల మధ్య 25 ఎకరాల విస్తీర్ణంలో ఇది ఉంటుంది. గిరిజనుల ఇళ్లు, వారి జీవన విధానాన్ని పరిచయం చేయడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశ్యం. తద్వారా పర్యాటకులకు భిన్నమైన అనుభవం లభించనుంది.
2010లో అప్పటి సబ్ కలెక్టర్ ప్రశాంత్ నాయర్ ఈ ప్రాజెక్టుకు పునాది వేయగా.. గత నెలలోనే ఇది పూర్తయింది. స్థానిక గిరిజన తెగలతోనే దీన్ని నిర్మింపజేశారు. ఈ ప్రాజెక్టు అందాలు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా కంట్లో పడ్డాయి. ఆయన తన ట్విట్టర్ పేజీలో దీనిని షేర్ చేశారు.
‘‘ఇది ఎంతో అందంగా ఉంది. కేరళ టూరిజమ్ కు ధన్యవాదాలు. ఈ గ్రామం సహజ నిర్మాణ రూపకల్పన అద్భుతంగా ఉంది. సింప్లిసిటీ ఎంత అద్భుతంగా ఉంటుందో చూపిస్తోంది’’ అని మహీంద్రా పేర్కొన్నారు.