Hong Kong: సుదీర్ఘకాలం జీవించిన మగ పాండా ఇక లేదు.. కారుణ్య మరణం ప్రసాదించిన వైద్యులు
- 35 ఏళ్ల వయసులో మృతి
- అనారోగ్యంతో బాధపడుతుండడంతో కారుణ్య మరణాన్ని ప్రసాదించిన వైద్యులు
- పాండాల్లో 35 సంవత్సరాలంటే మానవుల్లో 105 సంవత్సరాలతో సమానం
సుదీర్ఘకాలం జీవించిన మగ పాండాగా గుర్తింపు పొందిన అన్ అన్ ఇక లేదు. అనారోగ్యంతో బాధపడుతున్న దానికి వైద్యులు కారుణ్య మరణాన్ని ప్రసాదించారు. హాంకాంగ్ ఓషన్ పార్కులో ఉన్న ఈ 35 ఏళ్ల పాండా ప్రపంచంలోనే అత్యధిక కాలం జీవించిన మగపాండాగా రికార్డులకెక్కింది.
పాండాల్లో 35 ఏళ్లు అంటే మానవుల్లో 105 సంవత్సరాలతో సమానం. అనారోగ్యంతో బాధపడుతుండడంతో గత మూడువారాలుగా దీనిని చూసేందుకు సందర్శకులను అనుమతించలేదు. ఇటీవల దాని ఆరోగ్యం మరింత దిగజారింది. దీంతో అది మరింత బాధపడకుండా ఉండేందుకు ఓషన్ పార్క్ పశువైద్యులు నిన్న కారుణ్య మరణాన్ని ప్రసాదించారు.
అన్ అన్‌తోపాటు జియా జియా అనే ఆడ పాండాను 1999లో హాంకాంగ్‌కు చైనా బహుమతిగా ఇచ్చింది. అన్ అన్ 1986లో చైనాలోని సిచువాన్‌లో జన్మించింది. జియాజియా 2016లో 38 ఏళ్ల వయసులో మృతి చెందింది.