Piyush Goyal: తెలంగాణ సీఎం కేసీఆర్ అసభ్యంగా మాట్లాడుతున్నారు: పీయూష్ గోయల్
![union minister fires on telangana cm kcr](https://imgd.ap7am.com/thumbnail/cr-20220720tn62d80516bef95.jpg)
- తెలంగాణ మంత్రులు కూడా అసభ్యంగా మాట్లాడుతున్నారన్న గోయల్
- తెలంగాణ ప్రభుత్వం ఓ విఫల ప్రభుత్వమని ఆరోపణ
- కేంద్రానికి తెలంగాణ సర్కారు సహకరించడం లేదన్న కేంద్ర మంత్రి
తెలంగాణలో అధికార పార్టీ టీఆర్ఎస్, సీఎం కేసీఆర్‌పై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విమర్శలు ఎక్కుపెట్టారు. తెలంగాణలో ధాన్యం, బియ్యం కొనుగోలుకు సంబంధించిన విషయంపై సహచర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి బుధవారం మీడియా ముందుకు వచ్చిన గోయల్.. కేసీఆర్ తీరుపై మండిపడ్డారు. తెలంగాణ సీఎం అసభ్యంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌తో పాటు తెలంగాణ మంత్రులు కూడా అసభ్య పదజాలాన్నే వాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ అన్‌పార్లమెంటరీ వ్యాఖ్యలు చేస్తున్నారని కూడా గోయల్ ఆరోపించారు.
నిరుపేదలకు తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా అన్యాయం చేసిన ప్రభుత్వం దేశంలో మరొకటి లేదని గోయల్ వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం ఓ విఫల ప్రభుత్వమని ఆయన ఆరోపించారు. దేశ ప్రధానితో పాటు కేంద్ర మంత్రులపైనా టీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు బాధాకరమని ఆయన విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ సర్కారు కేంద్రానికి సహకరించడం లేదని ఆయన ఆరోపించారు. కేసీఆర్ కు రాజకీయాలపై ఉన్న శ్రద్ధ ప్రజలపై లేదని పీయూష్ ధ్వజమెత్తారు.