BSP: పొలంలో వరి నాటు వేసిన బీఎస్పీ నేత ప్రవీణ్ కుమార్!... వీడియో ఇదిగో!
- కరీంనగర్ జిల్లాలో సాగుతున్న ప్రవీణ్ పాదయాత్ర
- మల్లారెడ్డిపల్లిలో వరి నాట్లు వేసిన బీఎస్పీ నేత
- 10 నిమిషాలు కూడా వంగి నాటు వేయడం కష్టమైందని వ్యాఖ్య
బహుజన యాత్ర పేరిట తెలంగాణను చుట్టేస్తున్న బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బుధవారం ఓ పొలంలో దిగి వంగి మరీ వరి నాటు వేశారు. పొలంలో అప్పటికే వరి నాట్లు వేస్తున్న మహిళలతో కలిసి ఆయన వరి నాటు వేశారు. ఈ వీడియోను ఆయన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. అంతేకాకుండా వంగి వరి నాటు వేయడం ఎంత కష్టమోనంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్... జిల్లాలోని వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి మీదుగా వెళుతున్న సందర్భంగా పొలాల్లో వరి నాట్లు వేస్తున్న మహిళలతో మాట కలిపారు. ఈ సందర్భంగా ఆయన మహిళలతో కలిసి వరి నాట్లు వేశారు. కనీసం 10 నిమిషాలు కూడా వంగి నాటు వేయడం కష్టమైందని పేర్కొన్న ప్రవీణ్.. ఈ తల్లులు రోజు 6గంటలు కష్టపడితే కేవలం రూ.300 వస్తాయని వ్యాఖ్యానించారు. దొరలు మాత్రం నడుం వంచకుండానే వేల కోట్లు ఎలా సంపాదిస్తున్నారని, శ్రామికులకు సంపద రావాలంటే తెలంగాణలో బీఎస్పీ గెలవాలని ఆయన అన్నారు.