YSRCP: సీబీఐ చేతికి నెల్లూరు కోర్టులో డాక్యుమెంట్ల చోరీ కేసు?
- ఇటీవలే నెల్లూరులోని జిల్లా కోర్టులో చోరీ
- కాకాణి చేయించారన్న టీడీపీ నేత సోమిరెడ్డి
- సోమిరెడ్డి ఆరోపణలను కొట్టి పారేసిన కాకాణి
- ఈ కేసుపై సీబీఐ దర్యాప్తునకు అభ్యంతరం లేదన్న ఏజీ
- ఆ దిశగా ఆదేశాలు జారీ చేస్తామన్న హైకోర్టు
- విచారణ ముగించి తీర్పును రిజర్వ్ చేసిన కోర్టు
ఏపీలో రాజకీయ ప్రకంపనలు రేకెత్తించిన నెల్లూరు జిల్లా డాక్యుమెంట్ల చోరీ కేసు సీబీఐ చేతికి చేరేలా కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసుపై మంగళవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా ఈ కేసును సీబీఐ దర్యాప్తునకు ఇస్తే తమకేమీ అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం తరఫున హాజరైన అడ్వొకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. దీంతో ఈ కేసును సీబీఐకి అప్పగించే అంశంపై తగిన ఉత్తర్యులు ఇస్తామని హైకోర్టు తెలిపింది. అనంతరం ఈ కేసులో విచారణ ముగిస్తున్నట్లు ప్రకటించిన కోర్టు తుది తీర్పును రిజర్వ్ చేసింది.
కొంతకాలం క్రితం నెల్లూరులోని జిల్లా కోర్టులోకి చొరబడ్డ గుర్తు తెలియని దుండగులు... కోర్టులోని పలు కీలక పత్రాలను అపహరించారు. ఈ పత్రాలతో పారిపోతున్న వారు కోర్టు ఆవరణలో పలు పత్రాలను పడేశారు. ఇలా పడిపోయిన పత్రాల్లో ఏపీ కేబినెట్‌లో వ్యవసాయ శాఖ మంత్రిగా కొనసాగుతున్న కాకాణి గోవర్ధన్ రెడ్డిపై నమోదైన ఓ కేసు వివరాలు కూడా కనిపించాయి. తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మంత్రిపై గతంలో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సోమిరెడ్డి పలు పత్రాలను కోర్టుకు సమర్పించారు. అదే సమయంలో పోలీసులు కూడా పలు కీలక ఆధారాలను కోర్టుకు సమర్పించారు.
చోరీలో ఈ కేసుకు సంబంధించిన కీలక పత్రాలు మాయమయ్యాయి. తనపై నమోదైన కేసు నుంచి బయటపడేందుకే కాకాణి ఈ చోరీ చేయించారని సోమిరెడ్డితో పాటు టీడీపీ నేతలు ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కోర్టులోకి చొరబడ్డ దొంగలు ఇతరత్రా పత్రాలను వదిలేసి కాకాణి కేసుకు సంబంధించిన పత్రాలను మాత్రమే ఎందుకు తీసుకెళ్లారని కూడా టీడీపీ నేతలు లాజిక్ తీశారు. ఈ ఆరోపణలను కాకాణి కొట్టిపారేశారు. టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధానికి తెరదీసిన ఈ కేసును సీబీఐ దర్యాప్తునకు అప్పగించే దిశగా పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం.