Britain: మా అత్తగారిచ్చిన 200 పౌండ్లతో మా మామ ప్రస్థానం మొదలెట్టారు!... ఇన్ఫీ మూర్తిని ఆకాశానికెత్తిన అల్లుడు రిషి సునాక్!
- ఇన్ఫీ మూర్తి కుమార్తె అక్షతను పెళ్లి చేసుకున్న రిషి సునాక్
- బ్రిటన్ ఎంపీగా గెలిచి ప్రధాని రేసులో దూసుకుపోతున్న రిషి
- ఇన్ఫీ మూర్తి సంపదపై వస్తున్న విమర్శలను తిప్పికొట్టిన వైనం
- తన మామ ప్రస్థానం తనకెంతో గర్వకారణమన్న సునాక్
బ్రిటన్ ప్రధాని రేసులో దూసుకుపోతున్న ప్రవాస భారతీయుడు, అక్కడి అధికార పార్టీ ఎంపీ రిషి సునాక్... తనకు పిల్లనిచ్చిన అత్తామామలను ఆకాశానికెత్తేశారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణ మూర్తి, సుధా మూర్తిల కుమార్తె అక్షతను రిషి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
ఇక మొన్నటిదాకా బోరిస్ జాన్సన్ కేబినెట్‌లో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన రిషి సునాక్... తాజాగా ప్రధాని పదవికి బోరిస్ రాజీనామా చేయడంతో ఆ పదవి రేసులో అందరి కంటే ముందు వరుసలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో తనపైనా, తన భార్య, అత్తామామల సంపదపైనా వస్తున్న విమర్శలపై స్పందించిన సునాక్... ఓ టీవీ చర్చా కార్యక్రమంలో మూర్తి దంపతుల ఔన్నత్యాన్ని చాటి చెప్పారు.
తన భార్య అక్షత కుటుంబం ఆది నుంచే సంపన్న కటుంబమేమీ కాదన్న సునాక్... తన అత్తగారు సుధామూర్తి ఇచ్చిన 200 పౌండ్లతో తన మామ నారాయణమూర్తి వ్యాపార ప్రస్థానాన్ని మొదలుపెట్టారని తెలిపారు. ఓ ఆశయంతో కదిలిన తన మామ... ప్రపంచంలోనే అతి పెద్దదైన, అత్యంత విజయవంతమైన కంపెనీల్లో ఒక దానిని నెలకొల్పారని తెలిపారు.
అంతేకాకుండా తన మామ నెలకొల్పిన సంస్థలో చాలా మంది బ్రిటిషర్లు పని చేస్తున్నారని కూడా చెప్పారు. తన మామ ప్రస్థానం తనకు ఎంతగానో గర్వకారణమని కూడా ఆయన తెలిపారు. తాను ప్రధానిగా పదవి చేపడితే.. తన మామ సాధించిన విజయ గాథలను స్థానికంగానూ ఎన్నింటినో సృష్టించగలననే విశ్వాసం తనకు ఉందని ఆయన చెప్పారు.