Andhra Pradesh: నా మీద అలిగినా ఫరవా లేదు... పనిచేయని వాళ్లకు మాత్రం టికెట్లు ఇవ్వను: వైసీపీ ఎమ్మెల్యేలతో జగన్
- గడపగడపకు మన ప్రభుత్వాన్ని సమీక్షించిన జగన్
- పనిచేయని ఎమ్మెల్యేల ప్రొగ్రెస్ రిపోర్ట్‌ను బయటపెట్టిన సీఎం
- తనతో పాటు ఎమ్మెల్యేలు పనిచేస్తేనే గెలుస్తామని వెల్లడి
- పనిచేసిన వారికి మాత్రమే టికెట్లు ఇస్తానని చెప్పిన జగన్
ఏపీలో అధికార పార్టీ వైసీపీ చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సోమవారం సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పార్టీ ఎమ్మెల్యేలు, జిల్లాల అధ్యక్షులు, రీజనల్ కో ఆర్డినేటర్లు పాల్గొన్న ఈ సమావేశంలో జగన్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పనిచేసిన వాళ్లకే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తానన్న జగన్... తన మీద అలిగినా ఫరవా లేదని, పనిచేయని వాళ్లకు మాత్రం టికెట్లు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తనతో పాటు ఎమ్మెల్యేలు కలిసి పనిచేస్తేనే వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలిచే అవకాశం ఉందని కూడా ఆయన చెప్పారు.
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కొందరు సీరియస్‌గా తీసుకోవడం లేదని చెప్పిన జగన్... కార్యక్రమాన్ని ఐదుగురు ఎమ్మెల్యేలు కేవలం ఐదు రోజుల్లోనే ముగించారని చెప్పారు. ఇక ఈ కార్యక్రమంలో ఒక్క రోజు మాత్రమే తిరిగిన వారి జాబితాలో మాజీ మంత్రి ఆళ్ల నాని, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఉన్నారని చెప్పారు. మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అయితే కేవలం రెండు రోజులు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని ఆయన తెలిపారు. ఐదుగురు మంత్రులు కనీసం పది రోజులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని జగన్ తెలిపారు. మొత్తం ఎమ్మెల్యేలందరి ప్రొగ్రెస్‌ను జగన్ సమీక్షలో బయటపెట్టారు.