Yashwant Sinha: రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రలోభాలకు తెరలేపారు: యశ్వంత్ సిన్హా
- ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారన్న సిన్హా
- ప్రజా ప్రతినిధులు విచక్షణతో ఓటు వేయాలని విన్నపం
- తాను ప్రభుత్వ ఏజెన్సీలపై కూడా పోరాడుతున్నానని వ్యాఖ్య
రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మరోవైపు విపక్షాల తరపున బరిలోకి దిగిన అభ్యర్థి యశ్వత్ సిన్హా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో డబ్బులు ఎరగా వేశారని, ప్రలోభాలకు తెరలేపారని బీజేపీపై ఆరోపణలు గుప్పించారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. రాష్ట్రపతి ఎన్నికల్లో పార్టీ విప్ లు పని చేయవని.... ప్రజా ప్రతినిధులు విచక్షణతో ఓటు వేయాలని కోరారు.
రాష్ట్రపతి ఎన్నికల ఫలితం ప్రజాస్వామ్య ప్రస్థానాన్ని నిర్దేశిస్తుందని అన్నారు. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లోని ప్రభుత్వాలను ప్రజాస్వామ్య విరుద్ధంగా కూల్చి వేశారని దుయ్యబట్టారు. తాను కేవలం రాజకీయ యుద్ధంలోనే కాకుండా, ప్రభుత్వ ఏజెన్సీలపై కూడా పోరాడుతున్నానని చెప్పారు. ప్రభుత్వ ఏజెన్సీలు చాలా శక్తిమంతంగా తయారయ్యాయని... అవి పార్టీలను కూడా చీల్చుతున్నాయని విమర్శించారు.