BJP: ఆ రాష్ట్రంలో ప్రజల నుంచి గో మూత్రాన్ని కొనుగోలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
- లీటరుకు రూ. 4 చెల్లించి గో మూత్రం సేకరించాలని ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం నిర్ణయం
- ఇప్పటికే పేడను సేకరిస్తున్న ప్రభుత్వం
- గోధన్ న్యాయ్ యోజన పథకంలో భాగంగా ఇప్పుడు గో మూత్రాన్ని సేకరించేందుకు కేబినెట్ ఆమోదం
హిందువులు ఆవును అత్యంత పవిత్రంగా భావిస్తారు. దాన్ని పూజిస్తారు. ఆవు పేడ, మూత్రాన్ని కూడా శుభకార్యాల్లో సంప్రదాయబద్ధంగా వాడుతారు. కొత్త ఇంట్లోకి వెళ్లినప్పుడు ఆవు మూత్రాన్ని చల్లుతారు. ఆవు పేడ, మూత్రం ఆరోగ్యానికి మంచిదని నమ్ముతారు. ఈ నేపథ్యంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం ఆవు మూత్రాన్ని ప్రజల నుంచి సేకరించాలని, లీటరుకు రూ. 4 చెల్లించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఆవు పేడను కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం మూత్రాన్ని కూడా కొనాలని నిర్ణయించింది. ఇందుకోసం ‘గోధన్ న్యాయ్ యోజన’ అనే పేరుతో ఓ పథకాన్ని అమలు చేస్తోంది.
ఇదంతా బీజేపీ పాలిత రాష్ట్రంలో అనుకుంటే పొరపాటే. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఛత్తీస్ గఢ్ లో ‘గోధన్ న్యాయ్ యోజన’ పథకం అమలు చేస్తున్నారు. దీని కింద ఇప్పటికే పశువుల పేడను సేకరిస్తుండగా.. తాజాగా గోమూత్రాన్ని కూడా కొననున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మరో వారం రోజుల్లో ఈ పథకం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానుందని వెల్లడించింది. పైలట్ ప్రాజెక్టుగా కొనుగోళ్లను ప్రారంభిస్తామన్న ప్రభుత్వం.. దీని కోసం ప్రత్యేకంగా కమిటీని కూడా ఏర్పాటు చేసింది. పేడను రూ.2 చొప్పున కొనుగోలు చేస్తుండగా... తాజా ప్రకటన ప్రకారం గోమూత్రానికి లీటరు ధర రూ.4 గా నిర్ణయించింది.
గోమూత్రాన్ని గ్రామ గోఠాన్ సమితి ద్వారా సేకరించనుంది. హరేలీ (రైతు పండుగ) పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ నెల 28న ప్రతి జిల్లాలో రెండు చోట్ల గో మూత్రం సేకరణ పథకం ప్రారంభం అవుతుందని ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌కు సలహాదారులైన ప్రదీప్ శర్మ ప్రకటించారు. గోధన్ న్యాయ్ యోజన కింద ప్రతి గ్రామంలో పశువుల కోసం షెడ్లను నిర్మించారు. గోసంరక్షణ విషయంలో బీజేపీ ప్రయోజనాలను దెబ్బతీయడానికే కాంగ్రెస్ ఈ పథకాన్ని తెరపైకి తెచ్చిందన్న అభిప్రాయాలు ఉన్నాయి.