Somu Veerraju: దేవాలయాల జోలికొస్తే ఖబడ్దార్: బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు
- దేవాలయాలను శక్తి కేంద్రాలు, భక్తి కేంద్రాలు, ముక్తి కేంద్రాలన్న వీర్రాజు
- ఆలయాల నిధులను మింగేయాలనుకోవడం దారుణమన్న బీజేపీ నేత
- ఈ యత్నాలను ప్రతిఘటిస్తామని హెచ్చరిక
హిందూ ఆలయాల జోలికి వస్తే చూస్తూ ఊరుకోబోమంటూ బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఘాటు వ్యాఖ్యలతో కూడిన హెచ్చరికలు జారీ చేశారు. దేవాలయాల జోలికి వస్తే ఖబడ్దార్ అంటూ ఆయన శనివారం ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్లను సంధించారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం రూ.5 లక్షల కంటే ఆదాయం తక్కువ ఉన్న దేవాలయాలను ప్రభుత్వ అధీనం నుంచి తప్పించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. అలా చేయకుండా ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న చిన్నచిన్న దేవాలయాల నిధులు కూడా మింగేయాలి అనుకోవడం పరమ ధర్మార్గమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
హిందూ దేవాలయాలను శక్తి కేంద్రాలు, భక్తి కేంద్రాలు, ముక్తి కేంద్రాలుగా అభివర్ణించిన వీర్రాజు వాటిని మూసివేయడానికి కొంతమంది ప్రయత్నిస్తుంటే ఆ ప్రక్రియలో ప్రభుత్వం కూడా భాగస్వామ్యం కావడం సరికాదన్నారు. దేవాదాయ శాఖ భూములు, నిధులను కాజేసి ధార్మిక వ్యవస్థను విచ్చిన్నం చేసే కార్యక్రమానికి వ్యతిరేకంగా ప్రతిఘటిస్తామని ఆయన తెలిపారు. హిందూ దేవాలయాల నిధులు కాజేసే ఘటన ఖచ్చితంగా కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందన్న వీర్రాజు.. ఏ దేవాలయాన్ని ముట్టుకున్నా తీవ్ర పరిణామాలను చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. మిగతా రాజకీయ పక్షాలు, సామాజిక వాదులు ఈ అంశంపై తమ స్పందనను తెలియజేయాలని వీర్రాజు కోరారు.