Sri Lanka: గొటబాయ పరారీతో చక్రబంధంలో రాజపక్స సోదరులు
![srilanka bans Mahinda Rajapaksa and Basil Rajapaksa flee from country](https://imgd.ap7am.com/thumbnail/cr-20220715tn62d17c3024446.jpg)
- ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక
- సంక్షోభానికి రాజపక్స సోదరులే కారణమని ప్రజల ఆరోపణ
- మహీంద, బసిల్‌లు దేశం దాటి పోకుండా నిషేధాజ్ఞలు
- ఈ నెల 28 దాకా అమలులో నిషేధం విధింపు
శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స పరారీతో ఆయన సోదరులు ఇద్దరూ చక్రబంధంలో చిక్కుకుపోయారు. గొటబాయ సోదరుల్లో మహీంద రాజపక్స మొన్నటివరకు శ్రీలంక ప్రధానిగా పనిచేసిన సంగతి తెలిసిందే. గొటబాయ మరో సోదరుడు బసిల్ రాజపక్స శ్రీలంక ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో మహీంద ప్రధాని పదవికి రాజీనామా చేయగా... ఆయన స్థానంలో రణిల్ విక్రమసింఘే ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఇక ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో బసిల్ కూడా ఆర్థిక మంత్రిగా రాజీనామా చేశారు.
శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభానికి రాజపక్స సోదరులే ప్రధాన కారణమంటూ ఆ దేశ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో గొటబాయ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలంటూ 3 రోజుల క్రితం కొలంబోలోని అధ్యక్ష నివాసాన్ని ప్రజలు ముట్టడించారు. ఈ పరిస్థితిని ముందుగానే పసిగట్టిన గొటబాయ గుట్టుగా మాల్దీవుల మీదుగా సింగపూర్ చేరుకున్నారు. సింగపూర్ చేరిన తర్వాతే ఆయన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. గొటబాయ రాజీనామాతో శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రధాని రణిల్ విక్రమ సింఘే ప్రమాణం చేశారు.
గొటబాయ పరారీ నేపథ్యంలో ఆయన సోదరులు మహీంద, బసిల్‌లు కూడా దేశం వదిలి పారిపోయే అవకాశముందని గ్రహించిన లంక ప్రభుత్వం వారిద్దరూ దేశం దాటిపోకుండా నిషేధం విధించింది. ఈ క్రమంలో ఈ నెల 28 వరకు మహీంద, బసిల్‌లు దేశం వదిలిపోకుండా ప్రభుత్వం నిషేధాజ్క్షలు జారీ చేసింది. ఇదిలా ఉంటే... గొటబాయ కంటే ముందుగానే దేశం దాటి పోయేందుకు యత్నించిన బసిల్ యత్నాలను లంక ప్రజలు అడ్డుకున్నారు.