Vijayashanti: తెలంగాణలో కేసీఆర్ పనైపోయింది: విజయశాంతి
- అందరినీ ఎల్లకాలం మోసం చేయలేరన్న విజయశాంతి
- ఈ నానుడి కేసీఆర్ విషయంలో నిజమవుతోందని వెల్లడి
- కేసీఆర్ పాలనకు ప్రజలే ముగింపు పలుకుతారని స్పష్టీకరణ
కొందరిని ఎల్లకాలం మోసం చేయొచ్చు, అందరినీ కొంతకాలం మోసం చేయొచ్చు, కానీ అందరినీ ఎల్లకాలం మోసం చేయలేరు అనే నానుడి తెలంగాణ సీఎం కేసీఆర్ విషయంలో నూటికి నూరు శాతం నిజమవుతోందని బీజేపీ నేత విజయశాంతి పేర్కొన్నారు. కేసీఆర్ మోసాన్ని తెలంగాణ ప్రజలు గుర్తించారని, తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పనైపోయిందని వ్యాఖ్యానించారు. ఇక సార్ ను ఇంటికి పంపాలని ప్రజలు డిసైడ్ చేసుకున్నారని తెలిపారు. ఈ వాస్తవాన్ని గుర్తించారు కాబట్టే బీఆర్ఎస్ అంటూ కేసీఆర్ జాతీయ పార్టీ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారని విజయశాంతి వెల్లడించారు.
తెలంగాణలో ఖేల్ ఖతం కావడంతో జాతీయస్థాయిలో కేసీఆర్ ను ఇక ఎవరూ పట్టించుకోరన్న విషయం అందరికీ తెలుసని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో, జాతీయ మీడియాను ఆకర్షించడానికి, తనను తాను జాతీయస్థాయి నేతగా పరిచయం చేసుకోవడానికే కేసీఆర్ ఇటీవల కాలంలో ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేస్తున్నారని విజయశాంతి ఆరోపించారు. దేశ ప్రధాని హోదాలో వచ్చిన మోదీకి స్వాగతం పలకనప్పుడే కేసీఆర్ కుళ్లు రాజకీయాలు దేశ ప్రజలకు అర్థమయ్యాయని వివరించారు.
ఇతర రాష్ట్రాల్లో ఇంధన ధరలు తగ్గించినా, తెలంగాణలో ఇంకా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించకపోవడం ప్రజలపై కేసీఆర్ చూపించే కపటప్రేమకు నిదర్శనం అని విమర్శించారు.
కొవిడ్ సంక్షోభం నుంచి ఇంకా బయటపడని ప్రజలను ఆదుకోవాల్సింది పోయి, ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వకపోవడం, విద్యుత్ చార్జీలు పెంచడం, ఆర్టీసీ చార్జీలు పెంచడం వంటి చర్యలతో ప్రజావ్యతిరేకత మూటగట్టుకుంటున్నారని విజయశాంతి వివరించారు. దాంతో కేసీఆర్ పాలనకు ముగింపు పలకాలని ప్రజలు నిర్ణయించుకున్నారని, ఇకనైనా కళ్లు తెరవకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోకతప్పదని కేసీఆర్ కు సూచిస్తున్నాం అంటూ విజయశాంతి సోషల్ మీడియాలో స్పందించారు.