Telangana: వర్షాలపై అర్ధరాత్రి దాకా సీఎం కేసీఆర్ సమీక్ష..మంత్రులు, అధికారులకు కీలక ఆదేశాలు
- సోమవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకూ సమీక్ష
- అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని ప్రజలకు సీఎం విజ్ఞప్తి
- నేడు భద్రాచలంలోనే ఉండి పరిస్థితి సమీక్షించాలని మంత్రి పువ్వాడకు ఆదేశం
తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు, వరదల పరిస్థితిని మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా సమీక్షించారు. ప్రగతి భవన్ లో సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు దాదాపు 12 గంటల సమీక్ష నిర్వహించారు. మరో వారం, పది రోజుల పాటు వర్షాలు కొనసాగనున్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అధికారులకు సహకరిస్తూ, స్వీయ నియంత్రణ పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సీఎం విజ్ఞప్తి చేశారు.
మహారాష్ట్ర సహా రాష్ట్రంలోని ఎగువ గోదావరి పరీవాహక ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది ఉద్ధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ఎస్సారెస్పీ తదితర రిజర్వాయర్లకు చేరుకునే వరదను ఎప్పటికప్పుడు కిందికి వదలాలని ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు.
గత రెండురోజులుగా వర్షాలు, వరదల నుంచి ప్రజలను కాపాడేందుకు చేపట్టిన రక్షణ చర్యలను అధికారులు సీఎంకు వివరించారు. నిజామాబాద్, ములుగు రామన్నగూడెం ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని, అయినా పరిస్థితి అదుపులోనే ఉందని అధికారులు సీఎంకు తెలిపారు. ప్రాణహిత, ఇంద్రావతి, వంటి గోదావరి ఉపనదులు పొంగి ప్రవహిస్తుండడంతో భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఈ నేపథ్యంలో మూడవ ప్రమాద హెచ్చరిక ప్రకటించినందున మంగళవారం కూడా భద్రాచలంలోనే ఉండి పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని మంత్రి పువ్వాడ అజయ్ ని సీఎం ఫోన్లో ఆదేశించారు.
వరంగల్, నల్లగొండ, సూర్యాపేట, తుంగతుర్తి, మహబూబాబాద్, జనగాం తదితర ప్రాంతాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించిన నేపథ్యంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, అధికారులు వారి వారి జిల్లా కేంద్రాలు, స్థానిక ప్రాంతాలను విడిచి ఎక్కడికీ వెళ్లొద్దని సీఎం స్పష్టం చేశారు. ఈ మేరకు ఉమ్మడి నల్లగొండ జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, అన్ని శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ తగు చర్యలు తీసుకోవాలని స్థానిక మంత్రి జగదీశ్ రెడ్డికి సూచించారు.
గోదావరి వరదల నేపథ్యంలో నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాలలో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తంగా ఉంచాలని, స్థానిక మంత్రులు ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డిని ఆదేశించారు. గడ్డెన్న వాగు, స్వర్ణ వాగుల్లో నీటి నిల్వ సామర్థ్యాన్ని 70 శాతం మేరకు నిర్వహిస్తూ అధిక వరదను ఎప్పటికప్పుడు కిందికి వదిలేలా ఇరిగేషన్ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సీఎం సూచించారు.