Vikram: అవన్నీ పుకార్లే... హీరో విక్రమ్ ఆరోగ్య పరిస్థితిపై అధికారిక ప్రకటన చేసిన మేనేజర్
- విక్రమ్ కు గుండెపోటు అంటూ కథనాలు
- తీవ్ర ఆందోళనలో అభిమానులు
- విక్రమ్ గుండెపోటుకు గురికాలేదన్న మేనేజర్
- ఛాతీలో స్వల్ప అసౌకర్యం మాత్రమేనని వివరణ
చియాన్ విక్రమ్ గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారంటూ వచ్చిన వార్తలతో అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో, హీరో విక్రమ్ మేనేజర్ సూర్యనారాయణన్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.
విక్రమ్ కు ఈ మధ్యాహ్నం ఛాతీలో స్వల్పంగా అసౌకర్యంగా అనిపించడంతో ఆసుపత్రిలో చేరారని వెల్లడించారు. ఆయనకు గుండెపోటు వచ్చిందన్న వార్తలు నిజం కాదని సూర్యనారాయణన్ స్పష్టం చేశారు. ఇలాంటి పుకార్లు వినాల్సి రావడం బాధాకరమని అభిప్రాయపడ్డారు. ఈ సమయంలో విక్రమ్ కుటుంబం పరిస్థితిని కూడా ఆలోచించాలని, వారి వ్యక్తిగత జీవితానికి ఇబ్బందికరంగా వ్యవహరించరాదని హితవు పలికారు.
విక్రమ్ రేపు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యే అవకాశాలు ఉన్నాయని మేనేజర్ వెల్లడించారు. ఈ అధికారిక ప్రకటనతో విక్రమ్ ఆరోగ్య విషయంలో స్పష్టత వస్తుందని భావిస్తున్నామని, ఊహాగానాలకు అడ్డుకట్ట పడుతుందని పేర్కొన్నారు. విక్రమ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని సూర్యనారాయణన్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.