Jagan: పావురాలగుట్టలో సంఘర్షణ ప్రారంభమయింది.. పాదయాత్రలో పార్టీ ఆలోచన రూపుదిద్దుకుంది: జగన్
- ఎన్నో కుట్రలు జరిగినా, ఎన్నో రాళ్లు పడ్డా తట్టుకుని నిలబడ్డానన్న జగన్
- మన మేనిఫెస్టో చూడాలంటేనే టీడీపీ భయపడుతోందని ఎద్దేవా
- గజ దొంగల ముఠాకు నిద్ర కూడా పట్టడం లేదని సెటైర్
రాష్ట్ర ప్రజలందరి అండ తనకు ఉందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. వైసీపీ ప్లీనరీలో ఆయన మాట్లాడుతూ 2009 సెప్టెంబర్ 25న సంఘర్షణ ప్రారంభమయిందని... 2011లో పాదయాత్రలో పార్టీ ఆలోచన రూపుదిద్దుకుని, వైసీపీ అవతరించిందని చెప్పారు. ఎన్నో కుట్రలు జరిగినా, ఎన్నో రాళ్లు పడ్డా, తట్టుకుని నిలబడ్డానని తెలిపారు. తనను ప్రేమించి, తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ శాల్యూట్ చేస్తున్నానని అన్నారు. ప్రతి పేదవాడికి సంక్షేమ ఫలాలను అందించడమే లక్ష్యంగా తమ పాలన సాగుతోందని చెప్పారు.
మన పార్టీ మేనిఫెస్టో చూడాలంటేనే టీడీపీ భయపడుతోందని జగన్ ఎద్దేవా చేశారు. మేనిఫెస్టోలో పేర్కొన్న వాటిలో 90 శాతం హామీలను అమలు చేశామని చెప్పారు. మేనిఫెస్టోలో పెట్టిన వాటిని గత టీడీపీ ప్రభుత్వం అమలు చేయలేకపోయిందని... అందుకే అది ఎవరికీ కనపడకుండా చేశారని, చివరకు టీడీపీ వెబ్ సైట్ నుంచి కూడా తొలగించారని అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్న పార్టీ వైసీపీ అని గర్వంగా చెపుతున్నానని చెప్పారు.
మన ప్రభుత్వంలో దోచుకోవడం, పంచుకోవడం ఆగిపోయిందని... అందుకే గజదొంగల ముఠాకు నిద్ర పట్టడం లేదని జగన్ అన్నారు. మనది చేతల ప్రభుత్వం అయితే, వాళ్లది అబద్ధపు విష ప్రచారం అని విమర్శించారు. మన రాష్ట్రంలో దుష్ట చతుష్టయం ఉండటం మన ఖర్మ అని అన్నారు. చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 దుష్టచతుష్టయమైతే... వీరికి తోడుగా దత్తపుత్రుడు కూడా ఉన్నారని ఎద్దేవా చేశారు. రేపు సాయంత్రం ప్లీనరీ ముగింపు సందర్భంగా పూర్తి స్థాయిలో ప్రసంగిస్తానని చెప్పారు.