Uttarakhand: ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం: నదిలోకి దూసుకెళ్లిన కారు.. 9 మంది మృతి
- నైనిటాల్ జిల్లాలో ఘటన
- నదీ ప్రవాహానికి కొట్టుకుపోయిన కారు
- కారులో ఉన్న 11 మందిలో 9 మంది మృత్యువాత
- బాధితులందరూ పంజాబ్ వాసులే
ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 9 మంది మృత్యువాత పడ్డారు. 11 మందితో వెళ్తున్న కారు రాంనగర్ ప్రాంతంలో అదుపుతప్పి నదిలోకి దూసుకెళ్లింది. ప్రయాణికుల్లో ఒక చిన్నారి కూడా ఉంది. బాధితులందరూ పంజాబ్‌కు చెందిన వారని పోలీసులు తెలిపారు.
సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రాష్ట్ర విపత్తు నిర్వహణ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది సహాయ కార్యక్రమాలు చేపట్టాయి. మొత్తం 11 మంది ప్రయాణికుల్లో ఇద్దరు మాత్రమే ప్రాణాలతో బతికి బయటపడ్డారు. మిగతా 9 మందీ చనిపోయినట్టు అధికారులు నిర్ధారించారు. కార్బెట్ జాతీయ పార్కులోని ధేలా జోన్‌లో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు.
ఉదయం 5 గంటల సమయంలో కారు కార్బెట్ పార్కు వైపు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్టు ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. వేగంగా దూసుకెళ్తున్న కారును ఆపేందుకు ప్రయత్నించినా ఆగకుండా వెళ్లిపోయారని పేర్కొన్నారు. అలా వెళ్లిన కారు ధేలా గ్రామంలోని నదిలో బలమైన ప్రవాహం కారణంగా కొట్టుకుపోయినట్టు వివరించారు. కాగా, ఇక్కడ గతంలోనూ పలుమార్లు ప్రమాదాలు జరిగాయి. దీంతో నదిపై వంతెన నిర్మించాలన్న చర్చలు జరుగుతున్నాయి. అంతలోనే ఇక్కడ మరో ప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం.