Saji Cherian: జనాలను దోచుకునే రీతిలో భారత రాజ్యాంగం ఉంది: దుమారం రేపుతున్న కేరళ మంత్రి వ్యాఖ్యలు
- సీపీఎం సమావేశాల్లో సాజి చెరియన్ వివాదాస్పద వ్యాఖ్యలు
- ఆగ్రహం వ్యక్తం చేసిన గవర్నర్ ఆరిఫ్ మహ్మద్
- పాలనా వ్యవస్థ సరిగా లేదనే కోణంలో తాను వ్యాఖ్యానించానని చెరియన్ వివరణ
భారత రాజ్యాంగంపై కేరళ మత్స్యశాఖ మంత్రి సాజి చెరియన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీలైనంత మంది సాధారణ ప్రజలను దోచుకునేలా మన రాజ్యాంగాన్ని రాశారని ఆయన అన్నారు. పాతానమిట్ట జిల్లాలో జరిగిన సీపీఎం సమావేశాల్లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. చెరియన్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చెరియన్ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ముఖ్యమంత్రి విజయన్ ను గవర్నర్ కోరారు.
మరోవైపు తన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో చెరియన్ దిద్దుబాటు చర్యలకు దిగారు. తాను రాజ్యాంగాన్ని దూషించలేదని చెప్పారు. తనకు రాజ్యాంగంపై ఎంతో గౌరవం ఉందని అన్నారు. పాలనా వ్యవస్థ సరిగా లేదని, ఆ కోణంలోనే తాను మాట్లాడానని వివరణ ఇచ్చారు. అంతేకాదు, తాను చేసిన వ్యాఖ్యలకు ఆయన క్షమాపణలు కూడా చెప్పారు. అయితే, చెరియన్ పై చర్యలు తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆయనపై చర్యలు తీసుకోకుంటే కోర్టుకు వెళతామని హెచ్చరించాయి.