Electric Vehicles: ఎలక్ట్రిక్ వాహన తయారీదారులకు కేంద్రం షోకాజ్ నోటీసులు
![union government notices to electric vehicles companies](https://imgd.ap7am.com/thumbnail/cr-20220705tn62c419a6256e1.jpg)
- లోపాలు కలిగిన వాహనాలను విక్రయించారని కేంద్రం ఆరోపణ
- నోటీసులు అందుకున్న కంపెనీల్లో ఎలక్ట్రిక్ (ఓలా ఎలక్ట్రిక్), ఒకినావా, ప్యూర్ ఈవీ
- ఈ నెలాఖరులోగా సమాధానం ఇవ్వాలని కేంద్రం ఆదేశం
- కంపెనీలు ఇచ్చే సమాధానం ఆధారంగా వాటిపై చర్యలు తీసుకునే అవకాశం
ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ) తయారు చేసే కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. లోపాలు కలిగిన వాహనాలను వినియోగదారులకు అందించినందుకు ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలంటూ ఆయా కంపెనీలను కేంద్రం సదరు నోటీసుల్లో ఆదేశించింది. తమ స్పందనను తెలియజేసేందుకు ఆయా కంపెనీలకు కేంద్రం ఈ నెలాఖరు దాకా గడువు విధించింది.
కేంద్రం నుంచి నోటీసులు అందుకున్న కంపెనీల్లో ఎలక్ట్రిక్ (ఓలా ఎలక్ట్రిక్), ఒకినావా, ప్యూర్ ఈవీ తదితర కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలు తయారు చేసిన ఎలక్ట్రిక్ వాహనాల్లో పలు వాహనాలు షార్ట్ సర్క్యూట్ కారణంగా కాలిపోయిన సంగతి తెలిసిందే. వరుసబెట్టి చోటుచేసుకున్న ఈ ఘటనలపై ఇప్పటికే కేంద్రం ఆగ్రహంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయా కంపెనీలకు కేంద్రం నుంచి నోటీసులు జారీ అయినట్లు సమాచారం. తానిచ్చిన నోటీసులకు ఆయా కంపెనీలు ఇచ్చిన సమాధానం ఆధారంగా కంపెనీలపై చర్యలకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది.