r madhavan: రాకెట్ వేగంతో మాధవన్ ‘రాకెట్రీ’ చిత్రం..ఒక్క రోజులోనే కలెక్షన్లు డబుల్
- ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా
- నటుడు మాధవన్ తొలిసారి దర్శకత్వం వహించి నిర్మించిన చిత్రం
- తొలి రోజు రూ. 65 లక్షలు వసూలు
- రెండో రోజు రెట్టింపైన కలెక్షన్లు.. ఇంకా పెరిగే అవకాశం
కోలీవుడ్ నటుడు ఆర్.మాధవన్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’. ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్నారన్న ఆరోపణలపై అరెస్ట్ అయిన ఆయన ఆ తర్వాత నిర్దోషిగా బయటకు వచ్చారు. ఆ తర్వాత ఇస్రో శాస్త్రవేత్తగా ఎలాంటి గుర్తింపును దక్కించుకున్నారనే ఇతివృత్తంలో తీసిన సినిమా ముందు నుంచి ఆసక్తి రేకెత్తించింది.
శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది. పరిమిత స్క్రీన్లలో, కేవలం మెట్రో నగరాల్లో మాత్రమే విడుదలైంది. పైగా, ఆదిత్య రాయ్ కపూర్ నటించిన బాలీవుడ్ యాక్షన్ మూవీ ‘రాష్ట్ర కవచ్ ఓమ్’తో పోటీ పడింది. అయినప్పటికీ మొదటి రోజు దేశీయ బాక్సాఫీస్ లో రూ.65 లక్షలు వసూలు చేసింది. ‘విక్రమ్’, ‘వాలిమై’ సినిమాల కంటే ఈ సినిమా థియేటర్లలో మంచి ఓపెనింగ్స్ సాధించింది. మంచి టాక్ రావడంతో రెండో రోజే దాదాపు 100 శాతం ఘన వృద్ధిని సాధించింది. రెండో రోజుకు చేరుకునే సరికి రూ. 1.25 కోట్లను ఆర్జించగలిగింది. దాంతో,ఆదివారం నుంచి ఈ చిత్రం వసూళ్లు మరింత పెరగడం ఖాయమని నిర్మాతలు భావిస్తున్నారు.
కాగా, రాకెట్రీ చిత్రానికి ఇప్పటికే అనేక ప్రశంసలు దక్కాయి. దీన్ని‘కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్’ లో ప్రదర్శించారు. అక్కడ చిత్రాన్ని చూసిన వాళ్లంతా స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ చిత్రానికి అద్భుతమైన సమీక్షలు కూడా వచ్చాయి. ఆర్. మాధవన్ అన్నీ తానై ఈ సినిమా చేశాడు. కథ, నిర్మాత, దర్శకత్వం వహించిన అతను ప్రధాన పాత్రలో కూడా నటించి మెప్పించాడు. దర్శకుడిగా తన తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఈ చిత్రంలో సిమ్రాన్, మిషా ఘోషల్, రజిత్ కపూర్ మరియు కార్తీక్ కుమార్ సహాయక పాత్రల్లో కనిపించారు.